విత్తనాల కోసం బారులు

Bars for seeds– స్వల్ప తోపులాట.. పోలీసుల బందోబస్తు
– షాపుల ఎదుట దారి పొడవునా లైన్లు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్‌/ మిరుదొడ్డి /మెట్‌పల్లి
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రధానంగా పత్తి పంటనే ఎక్కువగా వేస్తారు. అయితే, రాశీ-659 రకానికి ఇక్కడ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దాని కోసం రైతులు ఉదయం నుంచి విత్తన దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. మంగళవారం ఆయా షాపుల ఎదుట రైతులు పెద్ద సంఖ్యలో లైన్లలో నిల్చోవడంతో కొంత తోపులాట జరిగింది. బందోబస్తులో ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి ఎలాంటి ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఒక్కో రైతుకు రెండు బ్యాగులే ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు అక్కడి చేరుకొని వారిని సముదాయించి త్వరలోనే పూర్తి స్థాయిలో విత్తనాలు అందించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి పంటనే ఎక్కువ సాగు చేస్తారని తెలిపారు. కావాల్సిన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలో నిల్చొని ఉంటే రెండు బ్యాగులు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందుల దృష్ట్యా డిమాండ్‌ ఉన్న రాశీ 659ను అందుబాటులో ఉంచాలని కోరారు.
అందుబాటులో విత్తనాలు.. ఆందోళన చెందొద్దు
ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి విత్తనాలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. రైతులెవరూ ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అన్నారు. ఒకే రకాన్ని రైతులు అడగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పది లక్షల ప్యాకెట్లు అవసరమని అంచనా వేశామని, ప్రస్తుతం 8 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు జిల్లాకు వచ్చాయన్నారు. రాశీ రకం విత్తనాలు మంగళవారం 13 వేల ప్యాకెట్లు వచ్చాయన్నారు. రైతులందరికీ అందించాలన్న ఉద్దేశంతో 60 దుకాణాల్లో ఒక్కొక్క రైతుకు రెండు ప్యాకెట్ల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. జూన్‌ మొదటి వారంలో మరిన్ని ప్యాకెట్లు తీసుకొస్తామన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అదే విధంగా, మార్కెట్లో 55 కంపెనీలకు సంబంధించి 125 రకాల పత్తి విత్తనాలు లభ్యమవుతున్నాయని, వాటిని కూడా కొనుగోలు చేయాలని సూచించారు.
జీలుగ విత్తనాల కోసం రైతుల పడిగాపులు
జీలుగ విత్తనాల కోసం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు పడిగాపులు కాచారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎండను సైతం లెక్కచేయకుండా వరుసలో బారులు తీరారు. కొందరు రైతులు మండే ఎండలో నిలబడలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఈ కేంద్రం నుంచి ఒక్కో పాస్‌ పుస్తకానికి 30 కిలోల జీలుగ విత్తనాల బస్తాలను 80 మంది రైతులకు మాత్రమే విక్రయించారు. మిగిలిన 120 మంది నిరాశతో వెనుతిరిగారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జీలుగ విత్తనాల కొరతను తీర్చాలని రైతులు కోరుతున్నారు.
మెట్‌పల్లి వ్యవసాయ కార్యాలయంలో సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలను అందిస్తున్నారన్న సమాచారంతో రైతులు ఉదయమే భారీగా చేరుకున్నారు. విత్తనాల రసీదుల కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని రైతులను లైన్‌లో ఉంచారు. ఒక్కో రైతుకు బస్తా జీలుగ, జనుము మాత్రమే ఇవ్వడంతో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పది ఎకరాల భూమి ఉన్నా ఒకే బస్తా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖరీఫ్‌ వర్షాలు ముందుగా మొదలవడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాల కోసం పట్టణాలకు పరిగెడుతున్నారు. పొద్దుపొద్దున్నే మండల కేంద్రాలకు చేరుకుని దుకాణాల ఎదుట లైన్‌ కడుతున్నారు. అయితే, కొన్ని రకాల విత్తనాలకు ఎక్కువ డిమాండ్‌ ఉండటం.. రైతులందరూ అవే కావాలంటున్నందున అందరికీ ఒకే రోజు విత్తనాలు అందకపోవడం తో ఆవేదన చెందుతున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో పత్తి, జీలుగ విత్తనాల కోసం రైతులు దుకాణాల ఎదుట పెద్దఎత్తున బారులు తీరారు.

Spread the love