షూ వేసుకునే ముందు కొంచెం జాగ్రత్త

నవతెలంగాణ -హైదరాబాద్: పాములు కనిపించని ప్రదేశాల్లో నక్కి ఉంటాయి. అందుకే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవారు, పల్లెల్లోని వారు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పాము కాటు కారణంగా ఏటా వేలాది మంది మరణిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చివరికి ఇంటి ముందు పెట్టిన షూని సైతం జాగ్రత్తగా పరిశీలించి కాళ్లకు వేసుకోవాలని ఇక్కడి వీడియో చూస్తే తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అవగాహన కల్పించే ఓ వీడియో క్లిప్ ను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. మహిళ షూలో ఓ చిన్న నాగుపాము దాక్కుని ఉంది. షూని కదిలించగా, అది బయటకు వచ్చి బుసలు కొడుతుండడాన్ని వీడియోలో చూడొచ్చు. ‘‘కోబ్రా కొత్త షూని ట్రై చేస్తోంది’’అంటూ శుశాంత్ నందా ఆశ్చర్యం పలికించే ఎమోజీలను పోస్ట్ చేశారు. ‘‘జోక్ లను పక్కన పెట్టండి. వర్షాకాంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’అంటూ ఆయన హెచ్చరిక చేశారు. వేసుకునే వస్త్రాలు, గొడుగును సైతం ఈ కాలంలో చెక్ చేసుకోవాలంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. తేళ్లు సైతం ఉండొచ్చని ఓ యూజర్ పేర్కొనగా, తాను కప్పులు దాగున్న షూని వేసుకుని, పాము అన్న భయంతో విసిరి కొట్టినట్టు మరో యూజర్ చెప్పాడు.

Spread the love