రవాణా పోరాటానికి సిద్ధంకండి

– కార్మికులకు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య పిలుపు
– నవంబర్‌లో చలో పార్లమెంట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రవాణారంగ కార్మికులు సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరో సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్య్లూఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఫెడరేషన్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని డీసీఎమ్‌ ట్రాలీ యూనియన్‌ అడ్డాలో శుక్రవారంనాడాయన ఏఐఆర్‌టీ డబ్ల్యూఎఫ్‌ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులు హరిస్తూ, అన్ని రంగాల్ని విచ్ఛిన్నం చేస్తున్నదని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించకుండా రవాణా నిర్వహణపై పెను ఆర్థికభారాన్ని మోపుతున్నదని విమర్శించారు. ఊబర్‌, ఓలా పేరుతో అంతర్జాతీయ సంస్థలు దేశంలోని రవాణారంగ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని చెప్పారు. ఆ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా కేరళ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక రవాణారంగ యాప్‌ను అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ యాప్‌ తయారీ కోసం ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ తీవ్రంగా కృషి చేస్తున్నదనీ, ఈ ఏడాది జులైలో జరిగే సమావేశాల్లో దీనిపై అందరి అభిప్రాయాలు స్వీకరించి, కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ప్రత్యామ్నాయ యాప్‌ అమలు, ఇతర రవాణారంగ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు నవంబర్‌లో చలో పార్లమెంట్‌ ఆందోళనా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో రవాణారంగ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఫెడరేషన్‌ నగర కార్యదర్శి అజరుబాబు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, నాయకులు రమేష్‌, రాములు, ఎమ్‌డీ ఫాజిల్‌, మొయిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love