నాణ్యమైన కరెంటివ్వండి

నాణ్యమైన కరెంటివ్వండి– బోనాల ఏర్పాట్లపై సీఎమ్‌డీ ముషారఫ్‌ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బోనాలు పండుగ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫరూఖీ అధికారుల్ని ఆదేశించారు. జులై 7 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు బోనాల వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారంనాడిక్కడి కార్పొరేట్‌ కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్లు (సీఈ), సూపరింటెండింగ్‌ ఇంజనీర్ల (ఎస్‌ఈ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ బోనాలు పండుగ ప్రారంభానికి ముందే విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేయాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, పనుల్ని పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి దేవాలయానికి ఓ నోడల్‌ అధికారి, ఏఈని కేటాయించాలనీ, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖతో పాటు ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవాలనీ, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, తాత్కాలిక లైట్లు, ఎయిర్‌ కండిషనింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ మొదలైన వాటిని ముందస్తుగా సమకూర్చుకోవాలని చెప్పారు. విద్యుత్‌ సిబ్బంది, అధికారులు 24 గంటలు విధుల్లో ఉండాలనీ, ప్రజలు గుమి గూడే చోట్ల కరెంటు స్తంభాలు షాక్‌ కొట్టకుండా తనిఖీలు చేయా లనీ, ఎక్కడా విద్యుత్‌ లీకేజీలు ఉండరాదని ఆదేశించారు. ప్రతి గంటకూ విద్యుత్‌ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల రీడింగ్‌లు తీసుకోవాలనీ, ఏదైనా అసాధా రణంగా కనిపిస్తే వెంటనే సరిదిద్దాలని చెప్పారు. సమా వేశంలో ఇంచార్జి డైరెక్టర్లు నందకుమార్‌, డాక్టర్‌ నర్సింహులు, చీఫ్‌ ఇంజనీర్లు కె సాయి బాబా, ఎల్‌ పాండ్య, వి శివాజీ, పి బిక్షపతి, పి ఆనంద్‌, సిజిఎం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love