‘భగవత్‌’ గీత వెనుక…

'భగవత్‌' గీత వెనుక...”భారతీయ జీవన విధానంలో మర్యాద అనేది ఒక భాగం. ఆ మర్యాదే మన సంస్కృతి. మన ధర్మం. మర్యాదను పాటించేవాడు పని చేసుకుంటూ పోతాడు తప్ప నేనే చేశాను అని అహంకరించడు. అలా అంతానేనే అని అహంకరించేవాడికి నేను ప్రజాసేవకుడిని అని చెప్పుకునే అర్హతలేదు”… సరిగ్గా కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి, నూతన మంత్రివర్గం సమావేశమవుతున్న వేళ, సర్‌ సంఫ్‌ుచాలక్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలివి. ఇవి ఎవరినుద్దేశించి?ఆయన అంతటితో ఆగలేదు…. ”ఏడాదిగా మణిపూర్‌ శాంతికోసం ఎదురు చూస్తోంది. పదేళ్ళుగా అక్కడ శాంతి నెలకొనివుంది. పాత తుపాకీ సంస్కృతి ముగిసిపోయింది. కానీ ఏడాది క్రితం అక్కడ అశాంతి అంటుకుందో అంటించబడిందో తెలియదుగానీ ఆ మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి…” అన్నారు. ఇప్పుడు ఆయన ఎవరిగురించి మాట్లాడుతున్నారో అర్థమవుతోంది కదూ…!
”రాజకీయాల్లో ఎదుటి పక్షం ఎప్పుడూ ప్రతిపక్షమే అవుతుంది తప్ప శత్రుపక్షం కాదు. ప్రత్యర్థిని విరోధిగా చూడకూడదు. వారు మరో కోణం చూపుతారు. వ్యవస్థలో ఆ అవకాశం ఎప్పుడూ ఉండాలి. ఇరుపక్షాల మధ్య ఉండాల్సింది పోటీయేకానీ యుద్ధం కాదు” అని హితవు పలికారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని అన్నీ అబద్ధాలే ప్రచారం చేశారన్నారు… ఇప్పుడిక ఆయన ఏ పేరూ చెప్పకపోయినా ఎవరి గురించి మాట్లాడుతున్నారన్నది సుస్పష్టం. సంఫ్‌ునూ దాని సమస్త పరివారాన్నీ పక్కన పెట్టి, నాదీ ”గ్యారంటీ” అని ప్రకటించుకున్నది ఎవరు? అసత్య అర్థసత్య విభజన విద్వేష ప్రసంగాలతో విషం చిమ్మింది ఎవరు? మణిపూర్‌ మారణకాండను కనీసం కన్నెత్తి చూడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది ఎవరు? కేసులతో వేధించి, జైళ్లకు పంపించి, అనేకానేక భయాందోళనలకు గురిచేసి, ఆఖరికి వారి బ్యాంకు ఖాతాలను సైతం నిలిపేసి… ఎన్నికల్లో ఎదుటి పక్షానికి పోరాడే అవకాశమే లేకుండా దారులన్నీ మూసేసిన పన్నాగాలు ఎవరివి? అంతా బహిరంగ రహస్యమే కదా. అందువల్ల సర్‌ సంఫ్‌ుచాలక్‌ ఆగ్రహావేదనలు ఎవరినుద్దేశించినవో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు.
అయితే… ఈ ఆరెస్సెస్‌ అగ్రనేత ‘ఆక్రందనలు’ అర్థం చేసుకోదగినవీ, అక్షర సత్యాలే అయినా, ఇందులో చిత్తశుద్ధిని చూడలేం. ఎందుకంటే, ఇవన్నీ వీరి ప్రమేయం లేకుండానే జరిగాయా? అలా జరగడం సాధ్యమేనా? ఆరెస్సెస్‌ ప్రమేయం లేకుండానే మోడీ తనని తాను దైవాంశసంభూతుడిగా ప్రకటించుకున్నాడా? అయినా ఈ పదేండ్లుగా లేనిది వీరికిప్పుడే ఎందుకీ జ్ఞానోదయమైందీ? జూన్‌ నాలుగుకు ముందు ఈ హితబోధలో అభిశంశనలో ఎందుకు బయటికి పెగల్లేదు. ఇవీ ఇప్పుడు ప్రశ్నలు. అసలీ విభజన విద్వేష భావజాలానికీ ఫాసిస్టు ధోరణులకూ మూలమే వీరు కదా. నిజానికి ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలోని రెండువందల యాభై పైచిలుకు సంస్థలలో బీజేపీ ఒకటి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ అనేది ఆరెస్సెస్‌ రాజకీయ విభాగం మాత్రమే. ఆ బీజేపీకి సైద్ధాంతిక నాయకత్వం అందించేదే ఆరెస్సెస్‌. దానికి సర్వాధిపతి సర్‌ సంఫ్‌ుచాలక్‌. అందువల్ల బీజేపీనీ ఆరెస్సెస్‌ను వేరుగా చూడలేం. పైగా ఈ సర్‌ సంఫ్‌ుచాలక్‌కు, వీరి ప్రధాన స్థావరమైన నాగ్‌పూర్‌ కేంద్రానికీ బీజేపీలో తిరుగే ఉండదని ప్రతీతి. మరి అలాంటి ఈ సర్వాధినేత ఇప్పుడు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నాగ్‌పూర్‌కూ ఢిల్లీకి మధ్య అంతరం పెరుగుతున్నదా? నాగ్‌పూర్‌ ఆధిపత్యానికి సవాలుగా ఢిల్లీలో అధికారం ఘనీభవిస్తున్నదా? ఇది నమ్మశక్యమేనా?
ఇక ఆరెస్సెస్‌ అధికార పత్రిక ‘ఆర్గనైజర్‌’ ప్రచురించిన ఒక వ్యాసాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. సంఫ్‌ు సీనియర్‌ నేత రతన్‌ శార్ధా రాసిన ఈ వ్యాసంలో మితిమీరిన అతివిశ్వాసమే బీజేపీ కొంపముంచిందని పేర్కొన్నారు. వాస్తవానికి బీజేపీ అధికారాన్నేమీ కోల్పోలేదు. వారనుకున్న 400+ రాలేదనేదే వీరి ఆక్రోషానికి కారణం. వచ్చుంటే ఏమేం చేయాలి అని వేసుకున్న బ్లూ ఫ్రింట్‌ భగమైందనేదే వీరి ఆవేదన. మైతీలకు కుకీలకు మధ్య ఘర్షణ రాజేయడం ఆరెస్సెస్‌ గేమ్‌ ప్లాన్‌లో అంతర్భాగమే. ఇప్పుడు హఠాత్తుగా మణిపూర్‌ మంటల గురించి వీరు మాట్లాడటం ఆశ్చర్యమే మరి! నిజానికి సంఫ్‌ునేతలు ‘ఆవేదన’ చెందుతున్నట్లుగా ఈ ధోరణులన్నీ బీజేపీలో ఇప్పుడు కొత్తగా మొదలైనవేమీ కావు. పదేండ్ల క్రితమే మొదలై అయిదేండ్లుగా ఊపందుకొన్నవే. కాషాయపెద్దల కండ్లముందే వారి కనుసన్నల్లో జరుగుతున్నవే. కానీ ఇవేవో ఇప్పుడే మొదలైనట్టు, తామేదో ఇప్పుడే గుర్తించినట్టు సంఫ్‌ు పెద్దలు మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. అందువల్ల ఇదంతా కేవలం ఓ తంతులా కనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఇంతకీ ఈ తతంగమంతా ఎందుకు? జరిగిన పరాభవం నుంచి తప్పుకునేందుకా? లేక దోషం బీజేపీదే తప్ప తమది కాదని చెప్పుకునేందుకా? బహుశా తాము ప్రజల విశ్వాసం కోల్పోతున్నామన్న సత్యాన్ని మరుగుపరిచేందుకు కాబోలు..! ఏమైతేనేం.. మొత్తానికి అటు కమలనాథులు ఇటు కాషాయపెద్దలు… నేతగణమంతా కలిసి నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు…!

Spread the love