ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధన

hyd vidyashaka commissioner– రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన
– నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాల సందర్శన
నవతెలంగాణ- బేగంపేట్‌
ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన చేయిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాద్‌ నల్లగుట్టలోని ప్రభుత్వ పాఠశాలలో ఆర్జేడి విజయలక్ష్మి, డీఈవో రోషిణి తదితర అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రయివేటు పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు తక్కువ అని, అనవసరంగా ఫీజుల రూపంలో డబ్బు పోగొట్టుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, మంచినీళ్లు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రయివేటు పాఠశాలల నుంచి ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లోకి పిల్లలను తీసుకొచ్చారని కమిషనర్‌ కొంత మంది తల్లిదండ్రులను అడగ్గా.. ప్రయివేటులో ఫీజులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చేర్పిస్తున్నామని వారు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు బోధన కూడా బాగుంటుందన్నారు. అలాగే కొంత మంది విద్యార్థులతో కమిషనర్‌ మాట్లాడి వివిధ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 1వ తరగతికి చెందిన హర్షిత అనే విద్యార్థిని 19వ టేబుల్‌ చెప్పడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధానో పాధ్యాయులు సీహెచ్‌ శౌరిని అభినందించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఐవోఎస్‌ సుమన్‌, డిప్యూటీ ఈవో శ్రీధర్‌, హైస్కూల్‌ హెచ్‌ఎం స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Spread the love