– అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ-బూర్గంపాడు
వారం రోజుల్లో భద్రాచలం వద్ద వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనుల ప్రగతిపై ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలోని ఐటీసీ విశ్రాంతి భవనంలో జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని ఇబ్రహీంపట్నం (విజయవాడ) నుంచి భద్రాచలం వరకు 165 కి.మీ రహదారిగా ప్రకటించినట్టు గుర్తుచేశారు. రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన పనులను 2015లో నితిన్ గడ్కరీతో కలిసి తాను శంకుస్థాపన చేశానన్నారు. కానీ 2015 నుంచి 2023 వరకు వంతెన పనులు జరుగుతూనే ఉన్నాయని, రానున్న ఫిబ్రవరి మాసాంతం వరకు వంతెన పనులు ఏ మాత్రం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనులపై మంత్రి ఫోన్ ద్వారా ఈఎన్సీ గణపతి రెడ్డి, భారత ప్రభుత్వ జాతీయ రహదారుల విభాగం ప్రాంతీయ మేనేజర్ కుష్వాలతో మాట్లాడి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తాను మాట్లాడుతానని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో జాతీయ రహదారుల శాఖ ఈఈ యుగంధర్, డీఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.