‘మతం వ్యక్తిగత అంశంగా ఉండాలి. అయితే అది రాజకీయాల్లో చొరబడి మతోన్మాద రూపం తీసుకున్నప్పుడు దాన్ని ఒక పెద్ద శత్రువుని ఎదుర్కొన్నట్టుగానే ఎదుర్కోవాలి’ అని భగత్‌సింగ్ చెబుతుండేవాడు. మతం, మూఢ నమ్మకాల బంధనాల నుండి ప్రజలు తామంతట తాము విముక్తి అవ్వాలంటాడు. దేశ ప్రగతికి అంధ విశ్వాసాలు, మతమౌఢ్యము ఓ పెద్ద అడ్డంకిగా తయారయ్యాయని అని కూడా అన్నాడు. అవి మన మార్గానికి అడ్డంగా పడుతున్న రాతిబండలని, వాటిని ఎలాగైనా మనం తొలంగించుకోవాలని, వీటిని అధిగమించడానికి అన్ని మతాల్లోని విప్లవోత్సహం గల యువకులు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చాడు భగత్‌సింగ్. నేడు దేశ పరిస్థితిని చూస్తే భగత్‌సింగ్ ఆనాడు చేసిన వ్యాఖ్యల వెనుక ఆవేదన ఎంత సరైందో అర్థమవుతుంది. ఇప్పుడు దేశంలో బుసలు కొడుతున్నది, వినాశకర పరిస్థితులు సృష్టిస్తున్నది, కార్పొరేట్ల బంధంతో మిలాఖత్ అయిన మతతత్వం. దేశానికి పొంచి ఉన్న మతతత్వ ప్రమాదాన్ని, తొంబై యేండ్ల క్రితమే భగత్‌సింగ్ గుర్తించగలిగాడు. స్వాతంత్రోద్యమ పోరాటంలో విప్లవకారునిగా త్యాగం, ధైర్య సాహసాలకు మారుపేరుగా, దేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడు భగత్‌సింగ్. బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతూ, దేశవిముక్తి కోసం నవ్వుతూ ఉరికంబమెక్కిన అసమాన స్వాతంత్య్ర పోరాటయోధుడైన భగత్‌సింగ్ అతని సహచరులు రాజ్‌గురు, సుకుదేవ్‌లను 1931 మార్చి 23న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు ఇది.
భగత్‌సింగ్ సామ్రాజవాదాన్ని, దోపిడీని వ్యతిరేకించడంతో పాటు తనను తాను నాస్తికుడి గానే భావించాడు. అన్నింటికీ భగవంతుని మీద భారం వేసి చేతులు ముడుచుకు కూర్చునే పద్ధతిని, కర్మ సిద్ధాం తం చాటున ‘తలరాతనే ‘ అనే మత్తుమందును యువకులకు తాగించి పడుకోబెట్టే మార్గాన్ని తప్పుపట్టాడు. ఆ మార్గం ఎప్పటికీ తన మార్గం కాజాలదని, ఈ ప్రపంచాన్ని మిథ్యగా భావించేవారు, ఈ దేశాన్ని, ప్రజల్ని మాయ అని చెప్పేవారు, ఎప్పటికీ ఈ దేశ స్వాతంత్య్రం కోసం నిజాయితీతో పోరాడలేరనేది ఆయన భావన. దేశం ఒక సజీవమైన వాస్తవం, అందమైన యదార్థంగా గుర్తించాడు.’ నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నాకు ఈ ప్రపంచం తప్ప వేరే ప్రపంచమో స్వర్గమో లేదు. కొంతమంది వ్యక్తులు ఈనాడు ప్రపంచాన్ని తమ స్వార్థం కోసం నరకంగా తయారు చేశారనేది నిజం. కానీ అంత మాత్రం చేత ఈ ప్రపంచాన్నే మిథ్య అని ప్రకటించి పారిపోవడం వల్ల ప్రయోజనం లేదు. దోపిడీదారులను, ఇతరులను బానిసత్వంలో బంధించి వారిని అంతం చేసి మనం ఈ ప్రపంచాన్నే స్వర్గంగా మార్చుకోవాలని’ భగత్‌సింగ్ అంటాడు.
‘అభ్యుదయం కోసం నిలబడే ప్రతివ్యక్తి పాత విశ్వాసాలలోని ఒక్కో అంశాన్ని మూఢంగా నమ్మకుండా, ఒకదాని తర్వాత మరొక దానిని సవాల్ చేయాలి. దానిపై వాదోపవాదాలకు సిద్ధపడాలి. కానీ కేవలం విశ్వసించడం, గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. అది మేధస్సును పనిచేయకుండా చేస్తుంది. వ్యక్తిని అభివృద్ధి నిరోధకంగా మార్చివేస్తుంది. వాస్తవికవాదినని చెప్పుకునే ప్రతివ్యక్తి విశ్వాసాలను సవాలు చేయాలి’ అన్నాడు భగత్‌సింగ్. ఆయన చెప్పిన ఒక్కోమాట ఎంతో ఔన్నత్యం, ఆచరణతోనే సాగాయి. అన్నట్టుగానే ఆయన జీవితాంతం లౌకికవాదాన్నే ఆచరిం చాడు. లౌకికవాదాన్ని దాటు కుని మార్క్సిజం వైపు అడుగులు వేశాడు. జాతీయో ద్యమానికి, దేశానికి మతతత్వం తెచ్చి పెట్టబోతున్న పెను ప్రమాదాన్ని ఆయన తన సమకాలీకులకంటే ముందు గానే ఊహించాడు. మతతత్వం వలస పాలనంతటి ప్రమాదకర మైనదని ఆయన పలు మార్లు పలు వేదికల నుంచి హెచ్చరించాడు. మతం వ్యక్తిగతం, మతతత్వం మన శత్రువని ఆయన ఆనాడే స్పష్టం చేశాడు.
”పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చో బెట్టుకుంటాం.. కానీ సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడి పోతాం. ఎంత సిగ్గుచేటు?” ఈ మాటలు ‘షహీద్’ భగత్‌సింగ్ రాసిన ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య)పై పంజాబ్ నుంచి వెలువడే ‘కిర్తీ’ అనే పత్రికలో ‘విద్రోహి’ (తిరుగుబాటుదారు) అనే కలం పేరుతో రాసిన వ్యాసంలో ఈ విషయాలు స్పష్టం చేశాడు. ”మన దేశంలో ఉన్నంత దుర్భర పరిస్థితులు మరే దేశంలోనూ లేవు” అంటూ ఆయన వ్యాసం మొదలువుతుంది.”ఇక్కడ చిత్రవిచిత్రమైన సమస్యలు న్నాయి. వీటిలో ముఖ్యమైంది అంటరానితనం. సమస్యేం టంటే, 30కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆరుకోట్ల మందిని అస్పృశ్యులుగా పరిగణి స్తున్నారు. వారిని ముట్టుకుంటే చాలు అధర్మం జరిగిపోతుందని చెబుతారు. వాళ్లు గుడిలో అడుగుపెడితే దేవుళ్లకు కోపం వస్తుందంటారు. వారు బావి నుంచి నీటిని తోడితే బావి అపవిత్రమై పోతుందంటారు. ఇరవై శతాబ్దంలో కూడా ఈ సమస్య ఇలా కొనసాగుతోందంటే వినడానికే సిగ్గుగా ఉంది” అంటాడు.1928 జూన్‌లో, అంటే అంటరానితనాన్ని నిషేధిస్తూ నాటి నేషనల్ అసెంబ్లీలో చట్టం చేయడానికి సరిగ్గా 22 ఏళ్ల కిందట, ఈ వ్యాసం అచ్చయ్యేనాటికి భగత్‌సింగ్ వయసు కేవలం ఇరవైయేండ్లే.
‘మేము కేవలం యువకులకే విజ్ఞప్తి చేయడానికి కారణం.. యువకులు పరాక్రమ వంతులు, ఉదార ప్రవృత్తి కలిగిన ఆవేశపరులు, యువకులు దారుణ అమానుష వ్యదలని పెదాల మీద చిరునవ్వుతో భరిస్తారు. నిర్భయంగా మృత్యువుని ఎదుర్కొంటారు. కారణం మానవ పురోగమన చరిత్రంతా యువతీ యువకుల నెత్తురుతో రాయబడింది. సంఘ సంస్కారాలు యువకుల శక్తి సాహసాలతో, ఆత్మబలిదానాలతో, ఆత్మవిశ్వాసాలతోనే లభించాయి. యువకులకు భయమన్నది ఏమిటో తెలియదు. ఆలోచనల కన్నా అనుభవాలే ఎక్కువగా సంపాదిస్తారు వారు. స్వతంత్రంగా, గంభీరంగా, శాంతి సహనాలతో యువకులు ఆలోచించాలి. భారతదేశ స్వాతంత్య్రం అనే ఆదర్శాన్ని తమ జీవిత లక్ష్యంగా వారు ఎంచుకోవాలి. తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ, బాహ్య ప్రభావాలకు దూరంగా ఉంటూ సంఘటితపడాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఆదర్శానికి నీళ్లు వదిలివేసే మోసగాళ్లతోను, నీతిమాలిన వాళ్లతోనూ స్నేహం చేయవద్దు. వాళ్లతో మీకు సారూప్యత ఏమిటి? గాంభీర్యంతో, నిజాయితీగా, సేవ త్యాగం బలిదానమనే వాక్యాన్ని మీ జీవితానికి ఆదర్శం, మార్గదర్శనం చేసుకోండి. ఒక జాతి నిర్మాణం కోసం వేలాది అజ్ఞాత స్త్రీ పురుషుల బలిదానం అవసరమని, వారు తమ శ్రేయస్సు కన్నా, తమ తమ ఆత్మీయుల ప్రాణాల కన్నా, దేశ శ్రేయస్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని గుర్తుపెట్టుకోండి.’ అంటూ భగత్‌సింగ్ యువతను ఉద్దేశించి చెపుతాడు.నేటి యువత వాటిని అలవర్చు కోవడం, నేడున్న దేశ పరిస్థితులకు చాలా అవసరం.
నేడు దేశంలో మనువాద సిద్ధాంత పునాదుల మీద నిర్మితమైన, మతతత్వ బీజేపీ అధికారాన్ని శాసిస్తోంది.దాని అసలు లక్ష్యం లౌకిక భారతదేశాన్ని మత రాజ్యంగా మార్చడం.ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, మతతత్వం రెచ్చగొట్టి నిసిగ్గు రాజకీయాలకు పాల్పడటం. మరోసారి మతతత్వ బీజేపీ అధికారం చేపడితే దేశానికి, దేశ ప్రజలకే కాదు ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ప్రమాదమే. స్వాతంత్రోద్యమ పోరాటస్ఫూర్తితో, భారతదేశ సార్వభౌమత్వాన్ని సామ్రాజ్య వాదులకు, పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు అప్పగించే బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని కాపాడుకు నేందుకు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల పోరాటస్పూర్తితో ముందుకు సాగడమే నేటి యువత కర్తవ్యం.
(నేడు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 93వ వర్థంతి)
కోట రమేష్
9618339490