వాస్తవ పరిస్థితుల అంచనాకే భగీరథ ‘ఇంటింటి’ సర్వే

వాస్తవ పరిస్థితుల అంచనాకే భగీరథ 'ఇంటింటి' సర్వే– 90 శాతం పూర్తి
– జలజీవన్‌ మిషన్‌ కింద కేంద్రం నిధులు పొందే యోచన
– పీఆర్‌, ఆర్డీ సిబ్బందితో మొబైళ్ల ద్వారా నిర్వహణ
– టీసీఎస్‌ పర్యవేక్షణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ తాగునీటి ప్రాజెక్టు ప్రస్తుత వాస్తవ పరిస్థితిని నిర్థారించేందుకుగాను ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భగీరథ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ అందుతున్న తాగునీటి సరఫరా పరిస్థితులను అంచనా వేయనుంది. సర్వే నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం భగీరథ ప్రాజెక్టును ప్రజలకు మరింత ప్రయోజనకారిగా ఉండేలా మలచాలని భావిస్తున్నది. అనేక గ్రామాలకు భగీరథ కింద తాగునీరు సరఫరా కావడం లేదనీ పలు ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు లేవనీ, పైపులైన్లు మాత్రమే ఉన్నాయనీ, పైపులు దెబ్బతిన్నాయని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వేకు ఆదేశించింది. సమగ్ర ఇంటింటి సర్వేను జూన్‌ 10 నుంచి చేపట్టారు. 15 రోజుల్లో పూర్తిచేయాలని సర్కారు ఆదేశించింది. అంటే ఈ నెలాఖరులోపు ముగించాలని చెప్పింది. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఈ సర్వేకు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ద్వారా సర్వే పర్యవేక్షిస్తున్నారు. ఆ సంస్థ రూపొందించి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు సంబంధిత సర్వే 90 శాతం పూర్తయింది. ఇంకా ఐదు శాతం మిగిలి ఉంది. మరో పది రోజులు పట్టే అవకాశమున్నట్టు అధికారులు అంటున్నారు. టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటూ ఆయా ప్రశ్నల ఆధారంగా సమాచారం, ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తున్నట్టు సమాచారం.
నిధుల కోసమే
గత ప్రభుత్వం మిషన్‌ భగీరథను ప్రతిష్టాత్మక పథకంగా ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి సురక్షిత తాగునీటిని అందిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే రాష్ట్రంలో చాలా గ్రామాలకు తాగునీరు అందడం లేదని ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలకు ఫిర్యాదులు అందాయి. దీంతో తాజా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అంచనా వేసి మరోసారి కేంద్రానికి నివేదిక పంపనున్నారు. అంతేగాక జల్‌జీవన్‌ మిషన్‌ కింద నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. గ్రామాల్లో కొత్త ఇండ్లకు కనెక్షన్లు, మరమ్మత్తులు, నిర్వహణ తదితర చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పరిధిలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సిబ్బందితోపాటు స్థానిక విద్యుత్‌ సిబ్బందిని ఇంటింటి సర్వే చేయడానికి వినియోగిస్తున్నారు. మిషన్‌ భగీరథ స్థితిపై ఇండ్ల్లల్లో ఉన్న నల్లా కనెక్షన్ల ఫోటోను వారి మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అలాగే లబ్ధిదారులకు భగీరథ కింద తాగునీరు అందుతున్నదా ? తదితర వివరాలను సైతం నమోదు చేస్తున్నారు. నల్లా కనెక్షన్‌ ఉన్నా, లేకపోయినా, పైప్‌లైన్లకు ఏదైనా నష్టం జరిగినా, గ్రామాల్లోని కుటుంబాలన్నీ నీటిని తాగుతున్నాయా, మరేదైనా అవసరాలకు వాడుతున్నాయా అనే అంశాలపై కూడా సర్వే ద్వారా తేల్చనున్నారు. ఈ ఇంటింటి సర్వేలో నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథ శాఖలకు భాగస్వామ్యం కల్పించలేదు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికార యంత్రాంగం చేపట్టింది. ఇందుకు టీసీఎస్‌ సహకారం తీసుకుంటుండటం గమనార్హం.

Spread the love