రాముడు, సీత ఉద్యానవనంలో మాట్లాడుకుంటూ విహరిస్తున్నారు. కొద్దిదూరంలో లక్ష్మణుడు కూడా ఉన్నాడు. ఉద్యానవనం ద్వారం వద్ద అలికిడై లక్ష్మణుడు అటువెళ్లాడు. అక్కడ నారదుడితో భటులు గొడవ పడుతున్నారు.
లక్ష్మణుడు భటులకు సర్దిచెప్పి నారదుడిని లోపలికి ఆహ్వానించాడు.నారదుడిని చూసి సీతా,రాములు నమస్కరించి ఉచితాసనాన్ని చూపారు.
”స్వామీ మీరు, నేను కలుసుకున్న సందర్భాలు నాకు గుర్తుకు లేవు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడికి వేంచేయడం నాకు చాలా సంతోషకరం! మీరు విచ్చేసిన కారణమేమిటో సెలవియ్యండి!” అన్నాడు రాముడు.
నారదుడు మాట్లాడలేదు! పైగా అటు తిరిగి కూర్చున్నాడు.
సీతా, రామ,లక్ష్మణులు ఆశ్చర్యపోయారు.నారదుడు ఎందుకు అలా చేస్తున్నాడో వారికి అర్థం కాలేదు.
స్వామీ! మీకై మీరే విచ్చేశారు! కారణమేమిటో ఇప్పటికైనా సెలవియ్యండి! ఆచరించటానికి రాముడు సదా సిద్ధంగా ఉన్నాడు’ అన్నాడు రాముడు వినయంగా.
అయినా నారదుడు మాట్లాడలేదు.
లక్ష్మణుడికి కోపం వచ్చింది. ఆవేశంగా నారదుడి వైపు రాబోయాడు, రాముడి సైగతో ఆగిపోయాడు.
”మునీంద్రా! ఇక్కడికి వచ్చి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే నా మనసు ఆందోళనకు గురి అవుతున్నది. ఎవరికి ఏం ఆపద వచ్చిందో చెప్పు నారదా!” అన్నది సీత.
”శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం! నీవేమో మహాలక్ష్మి అవతారానివి! కాని తన భక్తుడిని పట్టించుకోని నిర్లక్ష్యంతో వ్యవహరించటం ఎంతో అన్యాయం!” అన్నాడు నారదుడు.
”మేము భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం అసంభవం! మునీంద్రా మీరు పొరబడ్డారు!” అన్నాడు రాముడు.
”నరేంద్రమోడీ పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీ భక్తాగ్రేసరుడు రామదాసుని మించిన వాడు!” అన్నాడు నారదుడు.
”మోడీ రామదాసుని మించిన వాడెలా అవుతాడు స్వామీ!” అన్నాడు లక్ష్మణుడు అసహనంగా.
”రామదాసు అంతకు ముందున్న గుడిని అభివృద్ధి చేశాడు! ఆభరణాలు చేయించాడు! కాని మోడీ ప్రపంచంలో అత్యంత గొప్ప గుడిని అయోధ్యలో నిర్మించాడు. రాముడికి ప్రపంచఖ్యాతిని కలిగించాడు! అటువంటి మోడీకి అవమానాల పాలు చేశారు!” అన్నాడు నారదుడు.
”మునీద్రా! ఇంతకూ మీ ఉద్దేశ్యమేమీ! మోడీ లేకపోతే రాముడెవరో ప్రపంచానికి తెలియదా! అయినా మోడీకి జరిగిన అవమానమేమి? దానికి రాముడెలా కారణమవుతాడు!” అన్నాడు లక్ష్మణుడు కోపంగా.
”మొన్న జరిగిన ఎన్నికల్లో మోడీకి చావు తప్పి కన్నులొట్టపోయింది! అయోధ్యలో మోడీ పార్టీ ఓడిపోయింది! మిత్రుల మద్దతు లేకుండా అధికారంలో కొనసాగలేని దుస్థితి ఏర్పడింది! ప్రపంచంలోనే అత్యంత బలమైన నాయకుడిగా పేరుగాంచి, చివరకు దేశంలోనే బలహీనమైన ప్రధానిగా మారిపోయాడు!” అన్నాడు నారదుడు.
రాముడు చిన్నగా నవ్వాడు.
”మునీంద్రా! నేను పరిపాలన చేసింది త్రేతాయుగంలో. మోడీ కలియుగంలో పరిపాలన చేస్తున్నాడు. నేను ఆనాటి యుగధర్మాన్ని నిక్కచ్చిగా పాటించాను. మోడీ కలియుగధర్మం అంటే ప్రజాస్వామ్యాన్ని పాటించాలి. ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల మనోగతం. ఒక్క రజకుడు అన్న మాటకు, నా అర్ధాంగి తప్పేమీ లేదని తెలిసినా ఆమెను అడవుల పాలు చేశాను. కాని ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజల మనోగతాన్ని ఒక్కటైనా మోడీ అమలు చేయలేదు! పైగా వారందరినీ నిరంకుశంగా అణిచివేశాడు. ఇదేనా రాజు లక్షణం! స్వంత ప్రజలనే అణిచివేసేవాడు రాజెలా అవుతాడు. రావణాసురుడు సైతం తన ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు! రావణుడే కాదు. కృత, త్రేత, ద్వాపర యుగాలల్లో ఒక్క రాక్షసరాజు కూడా తన స్వంత ప్రజలను పీడించలేదు! కానీ మోడీ అందరు ప్రజలను, ముఖ్యంగా కష్టజీవులను విపరీతంగా పీడించాడు!” అన్నాడు రాముడు.
”నీకు గుడి కట్టించాడు కదా!” అన్నాడు నారదుడు.
”నాకు గుడి కట్టమని ఎవరి కలలోకి వచ్చి కోరలేదు! నాకు గుళ్లూ, గోపురాలు అవసరం లేదు! నా భక్తుల గుండెల కన్నా గొప్ప గుడి ఏదీ ఉండదు! ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలు రెచ్చగొట్టి కట్టించే గుళ్లునాకు అవసరం లేదు! ఈ విషయం అయోధ్యవాసులకు కూడా తెలుసు! అందుకే అయోధ్యలో బీజేపీని ఓడించారు!” అన్నాడు రాముడు.
”నీ తర్వాత నీ అంతటి పరిపాలకుడని భారతదేశం రామ రాజ్యమైందని, హిందూ మత రక్షకుడని మోడీని కీర్తిస్తున్నారు కదా!” అన్నాడు నారదుడు.
”మునీంద్రా.. స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా! రఘురాముడిని మించిన పరిపాలకుడా! ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్న రాముడెక్కడీ కరోనా వేలాది అనాధ శవాలు తన నియోజకవర్గం లోనే గంగానదిలో తేలియాడుతుంటే పట్టించుకోని మోడీ ఎక్కడీ ఇవన్నీ ప్రజలు గమనించారు కనకే! మోడీని హద్దులలో పెట్టారు!” అన్నాడు లక్ష్మణుడు.
”ఏదేమైనా! అందరిలా సాధారణ జన్మ ఎత్తని వాడు, దేవుడే పంపిన దేవదూతకి, మాటమీద నిలబడే మనిషికి ఇలాంటి దుస్థితి రావటానికి రాముడే కారణం!” అన్నాడు నారదుడు.
ఈ సారి లక్ష్మణుడు పెద్దగా నవ్వాడు.
”మునీంద్రా! మీరు ఎన్నికల పర్యటనలు బాగా చేసినట్లున్నారు! పెద్దనోట్ల రద్దు విఫలమైతే ఉరితీయమని చెప్పినవాడు, అబద్దాలు చెబితే ఉరితీయమని చెప్పినవాడు ఈ పెద్దమనిషే! భారతదేశంలో అతిపెద్ద విఫల నిర్ణయ మని ప్రపంచమంతా కోడై కూసింది! కాని ఉరికి సిద్ధం కాలేదు! నల్లధనం తెచ్చి భారత ప్రజలందరికి పదిహేను లక్షల రూపాయల చొప్పున పంచుతానని చెప్పి అమలు చేయలేదు! అయినా ఉరి తీయలేదు! ఇతనేనా మాట మీద నిలబడే మనిషి! ఒకరోజు మహ్మదీయులను తిట్టి, మరుసటి రోజే నేనామాట అనలేదని దబాయించగల ఘనాపాటి! ఏ రోటి వద్ద ఆ పాట గల అవకాశవాది అని ప్రజలు గుర్తించారు! అందుకే గతంలో ఉన్న బలాన్ని కత్తిరించారు”! అన్నాడు లక్ష్మణుడు.
”అయినా, మోడీ మళ్లీ ప్రధాని అయ్యాడు కదా!” అన్నాడు నారదుడు.
”మళ్లీ ప్రధాని అయ్యే మాట నిజమే! ఇంకా కొందరు ప్రజలు హిందూ మత ఉద్దరణ, అనే మాయలో పడిపోయి ఉన్నారు! వారందరూ వాస్తవాలు తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది! భారతదేశంలో ఇప్పుడు దశాబ్దకాలంలో ప్రజాస్వామ్యంలోకి పున: ప్రవేశించింది! పూర్తి ప్రజాస్వామ్యం పరిఢవిల్లేరోజు త్వరలోనే ఉంది!” అన్నాడు లక్ష్మణుడు.
– ఉషాకిరణ్