కేసీఆర్ పై భట్టి ఫైర్

నవతెలంగాణ మధిర: సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క మధిర బహిరంగసభలో విరుచుకుపడ్డారు. వందమంది కేసీఆర్ లు వచ్చినా మధిర నియోజకవర్గ గేటును కూడా తాకలేరని భట్టి విమర్శించారు. మధిర నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రియాంక రాకతో మధిర పులకించిందని.. అందరికీ ఇండ్లు.. భూములిచ్చినది గాంధీ కుటుంబం అని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక సభకు ఊరూ వాడా తరలి వచ్చిందన్నారు. దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న పోరాటమిది అంటూ ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ వస్తే సకల బాధలు తీరతాయని అంతా భావించారని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లుగా ప్రజా సంపదను పందికొక్కుల్లా తింటున్నారని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచాలన్నారు. ప్రియాంక గాంధీ సభకు వచ్చిన ప్రజల్లో సగం మంది కూడా కేసీఆర్ సభకు రాలేదన్నారు. వంద కేసీఆర్లు వచ్చినా మధిర గేటు తాకలేరన్నారు. 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి మధిర సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ అఫ్ట్రాల్ అని.. ఇలాంటి వాళ్లు ఊడుత ఊపులు ఊపితే మేం భయపడమన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో పాదయాత్ర చేశానన్న ఆయన.. ఆరు గ్యారెంటీలు ప్రకటించామన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని.. మధిరకు వరదలా నిధులు తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. మధిర పాలించాలి.. లేదా ప్రశ్నించాలని.. ఏం కానీ.. కాలేని నేతలకు ఓటేయొద్దని ప్రజలకు సూచించారు. 78-84 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Spread the love