”….పక్షపాతి?’

''....Partisan?''అది మహిళా దినోత్సవం. ఆడాళ్లందరూ పండుగ జరుపుకుంటున్నారు. ఆకాశంలో సగమని, భూమ్మీద సగమన్న పాత డైలాగులు గాలిలో తిరుగాడుతున్నాయి. పెద్ద దేశం, ఉపఖండం కాబట్టి వివిధ భాషల్లో ఇలా బెహనోంకీ త్యోహార్‌ మే బధాయీ దియాజారహాహై. మేరీ ప్యారీ బెయనియా బనేగీ దుల్‌హనియా అంటూ మళ్లీ షాదీ ముబారక్‌ తోఫా మొదలవుతుందని మాది మహిళా పక్షపాతి ప్రభుత్వమని దుమ్ము పట్టిపోయిన బాకాలు తీసి మరీ ఒప్పుతున్నారు. మహిళలా మజాకా అని కొందరంటున్నారు, అనుకుంటున్నారు. ఏ కహానీ ఏక్‌ దిన్‌ కా సుల్తానా అని, రేపటి నుండి ఉండదని ఈ రాజకీయ నాయకుల గురించి బాగా తెలిసినోళ్లుఅంటూనే ఉన్నారు. అందులోనూ ఎన్నికల కాలం అయినా భూత, వర్తమాన భవిష్యత్‌ కాలాల్లో ఎక్కువగా భవిష్యత్‌ కాలం గురించే చెబుతున్నారు. ఎందు కంటే అంతకుముందు చేసింది తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకో విషయమేమిటంటే ఇప్పుడున్న వర్త మానం, భవిష్యత్తు భూతకాలమైపోయినాక అందులో కూడా ఏమీ చేసింది ఉండదన్నది సత్యం.
అసలు పక్షం అంటే పార్టీ అని అర్థం. ఈ పార్టీలు ఇప్పటివి కాదు. ఎప్పుడో రామాయణం, భారతం, బైబిలు కథలు, ఖురాన్‌ కథలు, ఇతర మతాల వాటిల్లో కూడా మనం చూడొచ్చు. తమ్ముళ్ళే అన్నను వీడి అవతలి పక్షం చేరినారు. తరువాత్త రువాత సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందంటే అవతలై పక్షం వాళ్లు చంపేశారు. సైన్సు చెప్పేవాళ్ళను ముప్పు తిప్పలు పెట్టారు. డార్విన్‌ కూడా అవతలి పక్షం వాళ్ళవల్ల ఎన్నో కష్టాలెదుర్కొన్నాడు. ఇదంతా రాజకీయమా, సంగీ తం, సినిమాలు, చదువులు ఇలా అన్నింటిలోనూ పార్టీలున్నాయని మనకు తెలిసిపోతుంది. విద్యా, వైద్యం కూడా వ్యాపారమైపోయాక డబ్బున్నోళ్ళం దరూ ఒక పార్టీగా మారి జేబులు నింపుకుంటారు. చూస్తే కుబేరులూ, పేదోళ్లు నిజమైన రెండు పార్టీలు. కార్మికులు యజమానులు నిజమైన పార్టీలు. ఉద్యో గులు ప్రభుత్వాలు వాటి యాజమాన్యాలు అసలైన పార్టీలు. ఇలా పార్టీ, పక్షం వీటి గురించి సరైన నిర్వచనాలు తెలుసుకుంటే మన గందరగోళం తగ్గుతుంది. మనం ఎవరి పక్షం ఉండాలో కూడా తెలుస్తుంది.
ప్రజల పక్షపాతులుగా నటిస్తూ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లని ఆర్భాటంగా మొదలు పెడతారు. ఇక కాంట్రాక్టరు నుండి మంత్రి వరకు ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు నటిస్తారు. ఎక్కడ చూసినా పోస్టర్లు వీటి గురించే ఉంటాయి. ప్రచారానికి అయిన ఖర్చు దీనికి కలిపితే ఒక్కొక్కరికి ఒక్కో బెడ్‌ రూము అదనంగా కట్టచ్చు నేమో? ఇంకోచోట కట్టిన ఇండ్లని ఎవరికీ ఇవ్వకుండా ఐదేళ్ళు అలాగే పెట్టి అందులో గబ్బిలాలు, పక్షులు చేరేలాగ చేయడమూ చూస్తున్నాం. విద్యార్థి, నిరుద్యోగ యువత పక్షం మేమంటూ గ్రూపు పోస్టులంటూ మొదలు పెట్టి దాని నడకను నత్తకంటే నిదానంగా సాగిస్తూ కోర్టు కేసులు, పేపర్‌ ఔట్లు ఇలా అన్నీ సృష్టించి గ్రూపుల వెనుక గ్రూపులు ఎలా ఉంటాయో ఇంతకు కొన్ని వారాల క్రితం చెప్పుకున్నాం.
రైతు పక్షపాతులమూ మేమేనండోరు అని రైతు డ్రెస్సులు, తలకు పాగాలు కట్టుకొని అదే రైతులను ఎండకు, చలికి, వర్షానికి ఉద్యమాలు చేస్తున్నారని చితక్కొట్టి వాటర్‌ కెనన్‌లతో వర్షాలు కురిపించి, పొగ వేసి అదేదో శత్రువులను హింసించి నట్టు హింసించి కళ్ళు, ప్రాణాలు పోగొట్టి మరీ తమ ”పక్ష పాతం” చూపించుకుంటారు. టీవీ ప్రకటనల్లో రైతు ప్రభుత్వం మాది అని ఊదరబెట్టింటారు. మీరెవరి పక్షమో ముందు తేల్చండి అని గట్టిగా అరవాలనిపిస్తుంది. వినేవాళ్లెవ్వరు చెప్పండి? అలాగే ఇంతగా స్త్రీ జాతిని, మహిళలను ప్రేమించే ఈ నాయకులు మహిళా బిల్లును ఏండ్లపాటు ఎందుకు పెండింగ్‌ పెట్టారు, బిల్లు ఆమోదించినా అది నిజంగా మహిళల ఉద్ధరణ జరిగేలా ఉందా అన్న అనుమానాలు పోనే పోవు, ఎందుకంటే అది అలాగే ఎవరో ఒకరు పెండింగులో పెడుతున్నారు కాబట్టి. నిజంగా ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షపాతులు అన్న విషయం తెలుసుకోవాలంటే వాళ్లు అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంఖ్య, కుబేరుల సంఖ్య తీసుకొని చూస్తే తెలిసిపోతుంది. అందుకే ప్రభుత్వాలకు పక్షపాతం, కుబేరులకు పక్షపాతం ఉంటాయి. పాపం ప్రజలే నిజమైన పక్షపాతం ఎవరి మీద చూపాలన్న విషయంలో ఎప్పుడూ తప్పులు చేస్తుంటారు.
ఇక అధికార పక్షంలో చేరడమే మా లక్ష్యం అని కొందరు ఊసరవెల్లుల్లా రంగులు మార్చి, గో.పి లా గోడలు దూకుతూ, మొదటి చేపలా కొందరు,రెండో చేపలా కొందరు ”చెరువులు” మారి తమ తమ రక్షణ చూసుకునే ఎన్నికల కాలం ఇది. ఎక్కడ ఉంటే ఎన్ని ప్రయోజనాలుంటాయో లెక్కలుగట్టి మరీ ముందుకు పోతుంటారు. స్వపక్షం, వైరిపక్షం అంటూ ఉండవు వాళ్ళకు. చేర్చుకునే వాళ్ళూ అంతే. వాళ్ళు వస్తున్నందుకు చేర్చు కుంటున్నామని, చేర్చుకుంటున్నందుకు మారుటున్నామని ఎవ రిని వాళ్ళు సమర్ధించుకుంటారు. అలా తాము చేసిన పనిని కరెక్టు అనుకోవడమే వాళ్ళ పార్టీ. జెండాలు, అజెండాలు, ప్రజలు, ప్రజాస్వామ్యం, విలువలు ఇలా రాజకీయ పక్షాలకు సరిపోని మాటలు మాట్లాడడం వేస్టు అన్నది వారి పక్షం. అందరూ అంతేనా అంటే కాదు, సంఖ్య కొందరైనా నిఖార్సుగా నిటారుగా నిలబడే వాళ్ళున్నారు, పెద్ద దొంగ మళ్ళీ రాకుండా కాపాడుకోవాలని ప్రజల మేలు కోరే ”పక్షాలూ” ఉన్నాయన్నది నిజం. వాళ్ళే నిజమైన ప్రజల, బాధితుల పక్షపాతులు. అలాంటి పక్షపాతులను కొందరినైనా తీసుకురావడం ప్రజల కర్తవ్యం.
జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love