సొంత డబ్బులతో అభివృద్ధి.. బిల్లులిప్పించండి

సొంత డబ్బులతో అభివృద్ధి.. బిల్లులిప్పించండి– గవర్నర్‌ సీ.పీ.రాధాకృష్ణన్‌కు సర్పంచుల బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామాల్లో అభివృద్ధి పనులను సొంత డబ్బులు ఖర్చుపెట్టి చేశామనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పించాలని రాష్ట్ర గవర్నర్‌ సీ.పీ. రాధాకృష్ణన్‌కు సర్పంచుల బృందం విన్నవించింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డితో కూడిన బృందం వినతిపత్రాన్ని అందజేసింది. సర్పంచుల పదవీకాలం పూర్తై ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పాలనపై దృష్టి పెట్టడం లేదని గవర్నర్‌కు బృందం సభ్యులు వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, గ్రామపంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలను తమ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేశామని వాపోయారు.
పనులు చేసి ఏండ్లు గడుస్తున్నా నేటికీ బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కలెక్టర్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టి పనులు చేసిన సర్పంచులు వాటిని ఎలా తీర్చుకోవాలో అర్థంకాక, అప్పుల బాధతాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించేలా చూడాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తక్షణమే పెండింగ్‌ బిల్లులు విడుదల చేయిస్తానని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హామీనిచ్చారని యాదయ్య, లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సుభాష్‌ గౌడ్‌, గణేష్‌ సముద్రాల, రమేష్‌, రాజేందర్‌, లక్ష్మారెడ్డి, సురేష్‌ కూడా ఉన్నారు.

Spread the love