బీజేపీ-బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధం

– కుర్చీ కదులుతుందనే ఢిల్లీలో ప్రదక్షిణలు
– మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌ విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలది తెగిపోయే బంధం కాదనీ, అది ఫెవికాల్‌ బంధమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎంత కంఠశోష పెట్టుకున్నా వారి మాట ఎవరూ నమ్మరని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొంత మంది నేతలు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ విముక్తి కల్పిస్తున్నందని భరోసా ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్‌ ఒక్కటేనన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారని
ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాంతం దుబారు అని, దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని తెలిపారు. కేసీఆర్‌ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ వీధుల్లో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నా రని విమర్శించారు. కేటీఆర్‌ పర్యటన కంటోన్మెంట్‌ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో,రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యు ల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌ సాగుతోందనే ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని ఆరోపించారు.

Spread the love