బీజేపీ హఠావో..దేశ్‌కో బచావో

CPI general secretary D Raja– అధ్యక్ష తరహా పాలన కోసమే ఒకేదేశం… ఒకే ఎన్నికలు
– ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
– దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
– మోడీ ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కావాలి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ‘బీజేపీ హఠావో… దేశ్‌కో బచావో’అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. అధ్యక్ష తరహా పాలన కోసమే ఒకేదేశం ఒకే ఎన్నికలను బీజేపీ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం నుంచి దేశానికి, ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యమని ప్రకటించారు. మూడు రోజులపాటు జరగనున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రామకృష్ణ పండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్దూ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసంలో డి రాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పనిచేసే పార్టీలు గెలవాలని ఆకాంక్షించారు. బీజేపీని గద్దెదించడమే ప్రజల ముందున్న కర్తవ్యమని అన్నారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, ఇతర శక్తులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
కార్పొరేట్ల బడ్జెట్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పేదల కోసం కాదనీ, కార్పొరేట్లు, బడా పారిశ్రామికవేత్తల కోసమేనని డి రాజా విమర్శించారు. కార్పొరేట్‌ పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని చెప్పారు. పన్నులు కట్టే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగించలేదన్నారు. యువకులు, మహిళలు, రైతులు, పేదలపై దృష్టి పెట్టామంటూ కేంద్రం ప్రకటించిందనీ, ఆ వర్గాలకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ మోడీ హామీ ఇచ్చారనీ, ఈ పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిచ్చారా?అని ప్రశ్నించారు. నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? మహిళలపై లైంగిక వేధింపులు, దాడులను అరికట్టారా? అని ఆయన నిలదీశారు. మోడీ హయాంలో భారతదేశం ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, మళ్లీ అధికారంలోకి వస్తే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని బీజేపీ నాయకులు చెప్తున్నారని వివరించారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందన్నారు. ఈ పదేండ్లలో పేదల జీవన ప్రమాణాలు ఏమాత్రం మారలేదని విమర్శించారు. పేద ప్రజలను పట్టించుకోని మోడీ ప్రభుత్వం, బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు దాసోహమైందని చెప్పారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నదనీ, వారి కోసమే పని చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని బీజేపీ నాయకులు చెప్తున్నారని అన్నారు. అంతర్జాతీయ ఆకలి సూచీలో 125 దేశాల్లో భారత్‌ 111వ స్థానంలో ఉందని చెప్పారు. రాముని పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మోడీ చెప్పే రాముడు, గాంధీ చెప్పే రాముడికి తేడా ఉందన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. కానీ పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించిన ఎంపీలను మోడీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కబంధహస్తాల నుంచి దేశాన్ని, ప్రజలను విముక్తి చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆ దిశగా పార్లమెంటు ఎన్నికల్లో పనిచేయాలని పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Spread the love