ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ

– ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలి
– సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను గెలిపించాలి : పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చండూరు
మతోన్మాద బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చాక ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ గురువారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్‌ పట్టణంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీ మార్చే నాయకులను ఓడించాలన్నారు. మునుగోడు నియోజకవర్గ వెనుకబాటుకు కారణం గత పాలకులే అని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు, సాగు, తాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడింది సీపీఐ(ఎం) అని గుర్తు చేశారు. అందువల్ల సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి, ఆ స్థానంలో మనుధర్మాన్ని తిసుకొచ్చి ఫ్యూడల్‌ పద్ధతులు ప్రవేశపెట్టడం కోసం బీజేపీ కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ధ్యేయంగా బీజేపీ పని చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే సీఏఏ, పౌరసత్వ రద్దు, జ్యోతిష్యశాస్త్ర అమలు, విద్యా కాషాయీకరణకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైళ్లలో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టసభల్లో కమ్యూనిస్టుల బలం పెరగాల్సి ఉందని, ఇక్కడి నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ సుత్తికొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, నాయకులు జెర్రిపోతుల ధనుంజయగౌడ్‌, బొట్టు శివకుమార్‌, చిట్టిమల్ల లింగయ్య, ఎండి సలీం, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, కొల్లు రవి, సైదులు పాల్గొన్నారు.

Spread the love