ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్న బీజేపీ

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా బీజేపీ ప్రయివేటుపరం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ, పిల్లి నర్సింగరావ్‌ కాలనీలో గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థి సునితామహేందర్‌రెడ్డికి మద్దతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. బీజేపీ హామీ మేరకు ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో 83 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను వేగంగా ప్రయివేటుపరం చేస్తున్నారని, ఆర్టీసీ కూడా ఉండొద్దని.. రవాణా సవరణ చట్టం తెచ్చారన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి క్రికెట్‌ చూడటానికి, సముద్రంలో ఈదటానికి, మీడియాకు పోజులు ఇవ్వడానికి సమయమున్నది కానీ హత్రాస్‌ ఘటనపై స్పందించడానికి సమయం లేదని విమర్శించారు. బిల్కిస్‌ భాను కేసులో లైంగికదాడి నిందుతులను విడుదల చేస్తే భేష్‌ అన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ మళ్లీ వస్తున్నారని, రామున్ని చూసి ఓటెయ్యాలంటున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని, మూడు రంగుల జెండాను ఒప్పుకోలేదని గుర్తు చేశారు. వ్యాపారాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈటల బీజేపీలో చేరారని విమర్శించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, ఎన్‌.శ్రీనివాస్‌, నాయకులు బంగారు నరసింగరావు, విజరుకుమార్‌, సుమిత్రా, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love