వర్షాలు రాకమునుపే మరమ్మతులు చేయగలుగుతారా ?

– సాగునీటి శాఖ అధికారులతో సమీక్షలో జస్టిస్‌ ఘోష్‌
– బాధ్యుల జాబితా తయారుచేయాలని ఆదేశం : త్వరలో అన్నారం, సుందిళ్లలోనూ పర్యటన
– కొత్తగా నలుగురితో ఇంటర్నల్‌ టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మేడిగడ్డ బ్యారేజీకి వర్షాలు రాకముందే మరమ్మతులు చేయగలుగుతారా అని కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించారు. ఇందుకు దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని సంబంధిత అధికారులు జస్టిస్‌ ఘోష్‌కు వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఆర్‌కే భవన్‌లోని కాళేశ్వరం న్యాయకమిషన్‌ కార్యాలయంలో సమావేశం జరిగింది. దీనికి జస్టిస్‌ పీసీ ఘోష్‌తోపాటు సాగునీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీ జనరల్‌ బి అనిల్‌కుమార్‌, మరో ఈఎన్సీ నాగేందర్‌రావు, సీఈలు విజరుకుమార్‌, శ్రీనివాస్‌ హజరయ్యారు. ఈసందర్భంగా ఇటీవలి జస్టిస్‌ ఘోష్‌ మేడిగడ్డ బ్యారేజీని ప్రత్యక్షంగా చూసిన సంగతి తెలిసిందే. నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చించారు. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన మినిట్స్‌ తయారు చేసి తనకు సమర్పించాలని జస్టిస్‌ ఘోష్‌ అధికారులను ఆదేశించారు. బ్యారేజీకి సంబంధించి మరమ్మతులపై ఎక్కువసేపు చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టుపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులకు విషయమై కూడా చర్చించారు. బహిరంగ ప్రకటన ద్వారా ఈనెలాఖరు వరకు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన సమాచారం గానీ, ఇతర అంశాల విషయాల విషయంలో అభ్యంతరాలు, ఫిర్యాదులు, వినతులు ఉంటే ఈనెల 31లోపు పంపాలని కోరిన విషయం విదితమే. దీనికి అఫిడవిట్లు సైతం జతచేయాలని కమిషన్‌ ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే. అన్నీ ఒకేసారి తెరిచి పరిశీలించనున్నారు. ఈలోపు ప్రాజెక్టు నిర్మాణానికి కారణమైన వారందరి జాబితా తయారుచేయాలని అధికారులకు జస్టిస్‌ ఘోష్‌ సూచించారు. అనంతరం వీరందరికి నోటీసులు ఇచ్చి సమాచారం సేకరించేలా కమిషన్‌ కార్యాచరణ ఉండనుందని తెలిసింది. అలాగే మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సందేహాలను వెలుబుచ్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కూడా అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారుల నుంచి రాబట్టారు. వినతుల రూపంలో వచ్చే అఫిడవిట్ల ఆధారంగా కూడా విచారణ చేయనున్నట్టు తెలిసింది. శుక్రవారం సైతం మరోసారి అధికారులతో జస్టిస్‌ ఘోష్‌ సమావేశం కానున్నారు. ఇదిలావుండగా నలుగురు సీనియర్‌ ఇంజినీర్లతో ఇంటర్‌ టెక్నికల్‌ కమిటీని వేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని త్వరలో విధుల్లోకి తీసుకోనున్నారు. వీరంతా జస్టిస్‌ ఘోష్‌ పర్యవేక్షణలో పనిచేస్తారు. దాదాపు 100 మందిని ప్రభుత్వం కేటాయించినట్టు సమాచారం. వాస్తవానికి నాలుగురోజుల పర్యటన అనంతరం గురువారం ఆయన కోల్‌కతా వెళ్లిపోవాల్సి ఉంది. కానీ, జస్టిస్‌ ఘోష్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

Spread the love