ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీపై నేడు నిర్ణయం

– కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న దర్యాప్తు అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీపై నాంపల్లి కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందోనన్న ఉత్కంఠ ఇటు దర్యాప్తు అధికారుల్లో, అటు ఐపీఎస్‌ అధికారుల్లో నెలకొంది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసు వెలుగు చూడటానికి వారం క్రితం ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదే సమయంలో ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన నగర టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో పాటు ఒక ప్రయివేటు ఛానెల్‌ సీఈఓ కూడా దేశం విడిచివెళ్లినట్టు సమాచారం.
దీంతో వీరి కోసం ఆ సమయంలో టుకౌట్‌ నోటీసులు కూడా దర్యాప్తు అధికారులు జారీ చేశారు. ఒక పక్క కేసు దర్యాప్తు సాగుతుండగానే దేశం విడిచి అమెరికాకు వెళ్లిన రాధాకిషన్‌రావు తిరిగి వచ్చి దర్యాప్తు అధికారులకు లొంగిపోవటం, ఆయనను దర్యాప్తు అధికారులు అరెస్ట్‌ చేయటం తెలిసిందే. కాగా, ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నట్టు కొన్ని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ విషయంలో దర్యాప్తు అధికారులు ఎలాంటి ప్రకటననూ చేయలేదు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్‌రావుల విచారణలో తాము ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాల మేరకే ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించటం, అదే సమాచారాన్ని దర్యాప్తు అధికారులు కోర్టుకు అందజేశారు.
ఇటీవలే ఈ కేసులో ప్రధాన అనుమానితుడు ప్రభాకర్‌రావుగా పేర్కొంటూ దర్యాప్తు అధికారులు ఒక మెమోను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌రావు ఆచూకీ కోసం రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయటానికి అనుమతిని కోరుతూ దర్యాప్తు అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయటం, అదే రోజు బుధవారం తాను క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని తెలుపుతూ ప్రభాకర్‌రావు సైతం తన న్యాయవాది ద్వారా ఒక అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. రెడ్‌కార్నర్‌ నోటీసుకు సంబంధించి ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది, దర్యాప్తు అధికారుల తరఫు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయమూర్తి తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో రెడ్‌కార్నర్‌ నోటీసు జారీకి సంబంధించి న్యాయమూర్తి ఎలాంటి తీర్పును వెలువరిస్తారోనన్న ఉత్కంఠ ఇరు పక్షాల న్యాయవాదులతో పాటు దర్యాప్తు అధికారులు, సీనియర్‌ పోలీసు అధికారులలో నెలకొన్నది.

Spread the love