వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్‌ గవర్నర్‌

– 100 మందికి సీసీటీవీ ఫుటేజ్‌ చూపేందుకు సిద్ధం
– మమతకు, పోలీసులకు నో ఎంట్రీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ డాక్టర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని గురువారం ఉదయం 11.30 గంటలకు కోల్‌కతా రాజ్‌భవన్‌లో 100 మందికి చూపుతామని ప్రకటించారు. ‘సచ్‌ కే సామ్నే’ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా సామాన్యులు సైన్‌ అప్‌ చేసి, రాజ్‌భవన్‌లోని సీసీటీవీ ఫుటేజీని చూడటానికి ఈమెయిల్‌ ఐడీలతో పాటు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌లను అందుబాటులో ఉంచింది. ఈ ఫుటేజీని మమతా బెనర్జీ, ఆమె పోలీసులు తప్ప మిగిలిన పౌరులెవరైనా చూడవచ్చని గవర్నర్‌ నిర్ణయించారు. అయితే మొదటి 100 మంది మాత్రమే రాజ్‌భవన్‌లోని ఫుటేజీని చూస్తారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల రాజ్‌భవన్‌కు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఏప్రిల్‌ 24, మే 2 తేదీల్లో గవర్నర్‌ తనతో అనుచితంగా ప్రవర్తించడమే కాక బలవంతంగా హత్తుకునేందుకు ప్రయత్నించడంతో పాటు, ఈ విషయం ఎక్కడా చెప్పవద్దనీ కోరినట్టూ ఆమె ఆరోపించిన విషయం విదితమే. ఆ మహిళ ఆరోపణలపై స్పందిస్తూ, బోస్‌ సోషల్‌ మీడియాలో ”ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కానీ బెంగాల్‌లో అవినీతి, హింసపై నా పోరాటాన్ని వారు ఆపలేరు.” అని అన్నారు. ఈ ఫుటేజీ ప్రసారంపై గవర్నర్‌ ప్రకటన తర్వాత ఫిర్యాదుదారు ది ప్రింట్‌తో మాట్లాడుతూ, ”తప్పు చేయకుంటే, పోలీసులు కోరిన మొదటి రోజునే సీసీఫుటేజీని షేర్‌ చేసి ఉండాల్సింది. రాజ్‌ భవన్‌ సిబ్బందిని పోలీసులు కలవడానికి అనుమతించే వాడు” అని అన్నారు.
అయితే రాజ్‌భవన్‌ సీసీఫుటేజీని ప్రసారం చేయాలనే నిర్ణయం తీసుకుంటే, ముందే అందించకుండా, ఇలా అనౌన్స్‌ చేయడంలో ఏదో కల్పితం ఉన్నట్టు కోల్‌కతా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే. గవర్నర్‌ దీనిని కొట్టిపారేశారు. తణమూల్‌ కాంగ్రెస్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మంత్రి చంద్రిమా భట్టాచార్య ది ప్రింట్‌తో మాట్లాడుతూ, దాచిపెట్టేందుకు ఏమీ లేనపుడు సీసీఫుటేజీని బహిరంగపరచాలన్నారు. 11 కోట్ల మంది పౌరులున్న రాష్ట్రంలో 100 మందికి మాత్రమే చూపుతానని ఎందుకు అంటున్నారని నిలదీశారు. మేఘాలయ మాజీ గవర్నర్‌ తథాగత రారు మాట్లాడుతూ సీసీపుటేజీని మొదటగా కోరేందుకు పోలీసులకు చట్టపరమైన అధికారం లేదు. గవర్నర్‌కు చట్టపరమైన మినహాయింపు ఉందనేది వాస్తవం అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని రాజ్‌భవన్‌, మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్‌ ప్రభుత్వం మధ్య వాగ్వాదాన్ని ఈ ఘటన మరింత పెంచిందనే చెప్పవచ్చు.

Spread the love