– రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికపైనే ఈ ఎన్నికలు
– రామలక్ష్మణుల్లా కలిసి పని చేయండి : పటాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో సీఎం
– ఈడీ, సీబీఐ, అదానీ, అంబానీలే మోడీ పరివార్
నవతెలంగాణ-పటాన్‌చెరు
ప్రస్తుత ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడం లేదని.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మతాల మధ్య బీజేపీ చిచ్చు పారిశ్రామికవాడలోని అంబేద్కర్ సెంటర్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘నీలం మధు, పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ రామ లక్ష్మణుల్లా కలిసి పని చేయండి.. మీ రాజకీయ భవిష్యత్‌కు మేం అండగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. పటాన్‌చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా అని, కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు కలిసి ఉంటారని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నీలం మధు ఎంపీగా గెలవాలన్నారు. వైఎస్ హయాంలో మెదక్ అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు. మొన్నటి వరకు బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్లు ఎంపీలుగా ఉన్నా.. ఈ ప్రాంతానికి ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు బీఆర్‌ఎస్ అభ్యర్థి అని విమర్శించారు. వేల కోట్లు సంపాదించుకున్న ఆయన.. కేసీఆర్, హరీశ్‌కు వందల కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి.. ఎంపీగా పోటీ చేస్తున్నారని, పెగ్గు మీద పెగ్గు వేసినట్టు కుర్చీ మీద కుర్చీ వేసుకుంటారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి వచ్చిన మోడీ, అమిత్ షా.. రాంచంద్రాపురం వరకు మెట్రో విస్తరణకు, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి నిధులు, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావిస్తారనుకున్నామని అన్నారు. ఇవేవీ ఇవ్వకుండా.. మతాల మధ్య కొట్లాట పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించామన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా, మాదిగల వర్గీకరణ కేసు గెలవాలన్నా, ముదిరాజులు బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏలోకి మారాలన్నా నీలం మధును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీస్, అదానీ, అంబానీలే ప్రధాని మోడీ పరివార్ అని, ఆ పరివార్‌ను ఓడించాలని కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని తాండూరు సభలో సీఎం చెప్పారు. రైతు భరోసా వేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తానని అన్నారని.. ఎప్పుడు రాస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
నన్ను ఆశీర్వదించి గెలిపించండి..:
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ పార్లమెంట్ ఎన్నికలలో తనను ఆశీర్వదించి, గెలిపించాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రజలను కోరారు. ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం తనకు కల్పించిందని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే సీఎం రేవంత్ సహకారంతో, కేంద్రం నిధులతో పటాన్‌చెరు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, టీఎస్‌ఐఐసీ చైర్మెన్ నిర్మల, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.