కార్గిల్‌లో బీజేపీకి పరాభవం

– కాశ్మీర్‌ విభజనను తిరస్కరించిన లఢక్‌ ఓటర్లు
లఢక్‌ : కార్గిల్‌ జిల్లాలోని హిల్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ), కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 26 స్థానాల్లో ఈ కూటమికి 22 స్థానాలు లభించాయి. కూటమి సాధించిన విజయం ఊహించిందే. ఆర్టికల్‌ 370 కింద జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై కార్గిల్‌లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యతిరేకతే ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. అయితే ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమికి ఇంతటి భారీ ఆధిక్యత లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావించలేదు. కూటమిలో ఎన్సీకి 12 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు లభించాయి. లఢక్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ను హస్తగతం చేసుకోవడానికి 16 స్థానాలు చాలు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. గతంలో ఆ పార్టీకి ఒకే ఒక్క స్థానం ఉండేది. స్వతంత్రులకు కూడా రెండు సీట్లు దక్కాయి. 30 మంది సభ్యులుండే హిల్‌ కౌన్సిల్‌లో నాలుగు స్థానాలను మహిళలు, మైనారిటీలకు రిజర్వ్‌ చేశారు. వీరిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. మిగిలిన 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2019 ఆగస్టులో జమ్మూకాశ్మీర్‌ నుండి లఢక్‌ను వేరుచేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కార్గిల్‌లో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. 2019 ఆగస్ట్‌ 5 నాటి నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేక తిరస్కరిస్తారా అనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. ఎన్నికలకు ముందే ఎన్సీ-కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకున్నాయి. కార్గిల్‌ రాజకీయాలలో బీజేపీకి పెద్దగా చోటు లేదు. ఎన్సీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో భాగస్వాములే. ప్రజల మద్దతు లేకుండా రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా విభజించిన అన్ని పార్టీలు, శక్తులకు ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివని జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దులా చెప్పారు. 2019 వరకూ హిల్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై జాతీయ స్థాయిలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే అవి లెV్‌ా, లఢక్‌ స్థానిక వ్యవహారాలకే పరిమితమయ్యేవి. లఢక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జరిగిన ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం తమకు శాసనసభ అంటూ ఏదీ లేనందున తామే గళం విప్పాల్సి వస్తోందని హిల్‌ కౌన్సిల్‌ సభ్యులు చెబుతున్నారు. ఏదేమైనా జమ్మూకాశ్మీర్‌ విభజనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఎన్సీ అభ్యర్థుల్లో 70% మంది, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 45% మంది గెలుపొందారు.

Spread the love