అచ్చంపేటలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే…?

– ఎన్నికల ప్రచార సభ నిర్వహించలేని దుస్థితి
– కన్నెత్తి చూడని రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ అచ్చంపేట: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రేపటికి ప్రచారం ముగుస్తుంది. బీజేపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించలేదు. రాష్ట్ర స్థాయి నాయకులు నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఉమ్మడి జిల్లాలో నారాయణపేట, మక్తల్, గద్వాల, మహబూబ్ నగర్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలలో ఆ పార్టీలకు ప్రజలలో మంచి ఆదరణ ఉందని కేంద్ర, రాష్ట్ర అగ్ర నాయకులు భావిస్తున్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కారీ , బండి సంజయ్, ఈటల రాజేందర్ అగ్ర నాయకులు ఉమ్మడి జిల్లాలో పైన చెప్పిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.


అచ్చంపేట అసెంబ్లీ మెంటలో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల మహాసభలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తదితరులు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అచ్చంపేటలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ మాదిగ పోటి చేస్తున్నప్పటికీ ఆ పార్టీ అగ్ర నాయకులు అచ్చంపేట వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో నల్లమలలో కమలం వికసిస్తుందని భావించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సవంగా ఉన్నారని తెలుస్తుంది.

Spread the love