Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబెంగాల్‌లో బీజేపీ పాగా

బెంగాల్‌లో బీజేపీ పాగా

- Advertisement -

కలిసొచ్చిన ‘సర్‌’
బీటలు వారిన తృణమూల్‌ కంచుకోటలు
కోల్‌కతా
: పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటరు జాబితాల సవరణ (సర్‌) ప్రక్రియ బీజేపీకి లాభించింది. రాష్ట్రాన్ని 15 ఏండ్లు పాలించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. తృణమూల్‌ కంచుకోటలు బీటలు వారాయి. బెంగాల్‌ గ్రామీణ, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత కనబరచింది. బిర్‌భుమ్‌, పర్బ బర్ధామన్‌, హూగ్లీ వంటి జిల్లాలతో పాటు గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉండే జంగల్‌ మహల్‌ నిన్నటి వరకూ తృణమూల్‌కు కంచుకోటలు. అయితే ఇప్పుడవి బీజేపీ ఖాతాలోకి జారిపోయాయి. ముస్లింలు అధికంగా నివసిస్తున్న మాల్దా, ముర్షీదాబాద్‌, ఉత్తర దినాజ్‌పూర్‌ ప్రాంతాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం. 2021, 2024 ఎన్నికల్లో 90 శాతానికి పైగా ముస్లింలు తృణమూల్‌కే ఓటేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కన్పించలేదు. ముఖ్యంగా రాష్ట్రంలోని 65 శాతం హిందూ ఓటర్లు బీజేపీ వైపు సంఘటితం కావడంతో ఆ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు పార్లమెంటులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు సభ ఆమోదం పొందలేకపోయినప్పటికీ, మహిళలు మాత్రం బీజేపీ పక్షానే నిలిచారని ఎన్నికల ఫలితాలతో తేలింది. మహి ళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నా యంటూ బీజేపీ నేతలు పదే పదే చేసిన ప్రచారం ఫలించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఐదుశాతం మహిళా ఓట్లను అధికం గా పొందినట్టు ప్రాథమిక అంచనా. 2021 ఎన్నికల్లో మహిళా ఓటర్లలో తృణమూల్‌కు 48.02శాతం, బీజేపీకి 38.1 శాతం ఓట్లు వచ్చాయి.

బెంగాల్‌లో బీజేపీ విజయానికి మరో కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వో ద్యోగులు. తృణమూల్‌ ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను హరించిందన్న ఆరోపణ లున్నాయి. వీరితో పాటు ప్రభుత్వోద్యోగాలు ఆశించిన నిరుద్యోగ యువత కూడా బీజేపీ వైపు మొగ్గు చూపింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజులలో ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని, ప్రభుత్వోద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ వారిని ఆకర్షించింది. మరోవైపు రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడింది. ఈ పరిణామాలు సహజంగానే ఓటర్లను ఆగ్రహానికి గురిచేశాయి. బెంగాల్‌లో హిందూ ఓటర్లను బీజేపీ వైపు సమీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అన్ని విధాలుగా సహకరించింది. అటు కేంద్రం కూడా అసాధారణ రీతిలో దళాలను మోహరించింది. ఐదు వందల కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు రాష్ట్రంలోనే మకాం వేశాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఈసారి 92 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. ఆ పెరిగిన పోలింగ్‌ బీజేపీకే లాభించినట్టు తెలుస్తోంది.

50 ఏండ్ల తమిళనాడు చరిత్రలో…
గడచిన 50 ఏండ్ల తమిళనాడు చరిత్రలో తొలిసారిగా ఓ నూతన రాజకీయ శక్తి ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ఎంజీ రామచంద్రన్‌ డీఎంకే నుంచి బయటికి వచ్చి సినీ గ్లామర్‌తో విజయం సాధించారు. సీఎన్‌ అన్నాదురై, కరుణానిధి వంటి సీనియర్‌ నేతలు కూడా సినీ రంగం నుంచి వచ్చి తమిళ రాజకీయాల్లో రాణించిన వారే. ఇక జయలలిత సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజరు రాజకీయ వ్యవస్థలో కాలు పెట్టారు. ఆయనకు అప్పటి నాయకుల మాదిరిగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఓ కెరటంలా దూసుకొచ్చారు. వారసత్వ రాజకీయాలతో విసిగి వేసారిన తమిళ ఓటర్లు అనూహ్యంగా, ఎవరి అంచనాలకూ అందని విధంగా తీర్పును వెలువరించారు. తమిళ రాజకీయాలకు సినీ నటులు కొత్తేం కారు. అన్నాదురై, కరుణానిధి సినిమాల ద్వారా తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. సైద్ధాంతిక మూలంతోనే ఎంజీఆర్‌ ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ నిర్మాణాన్ని జయలలిత మరింత బలోపేతం చేశారు. అయితే విజరు ఎదుగుదల వెనుక ఎలాంటి సైద్ధాంతిక శిక్షణ లేదు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవమూ లేదు. కేవలం ప్రజలతో నేరుగా సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా ఆయన పార్టీ నిర్మాణం చేశారు. ఆయన మద్దతుదారులు కూడా సిద్ధాంతాలు, విధానాలను వల్లె వేయలేదు. సినిమాలు, డైలాగులు…ఇవే వారి సంభాషణల్లో దొర్లేవి. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా వారు వాటినే చూస్తే గడుపుతున్నారు. విజరు విజయం వెనుక అర్బన్‌, సెమీ-అర్బన్‌ ప్రాంతాలతో పాటు మహిళలు, యువత కీలక పాత్ర పోషించారు. గతంలో వైగో, విజయకాంత్‌, కమల్‌హసన్‌ వంటి సీనీ ప్రముఖులు రాజకీయ యవనిక పైకి వచ్చినా ప్రజల మనసుల్ని గెలుచుకోలేకపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -