Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనెత్తురోడిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్

నెత్తురోడిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్

- Advertisement -

అల్లర్లలో 30 మందికిపైగా మృతి ..
200 మందికి పైగా గాయాలు

అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా జనాగ్రహం

లాహోర్ : పాకిస్తా న్ ఆక్రమిత కాశ్మీర్ మరోసారి నెత్తురోడింది. స్థానిక అవామీ యాక్షన్ కమిటీ-(జేఏఏసీ)పై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం మంగళవారం కాల్పులు జరిపింది. దీనితో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో పలువురు భద్రతాసిబ్బంది సహా మొత్తం 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, 200 మంది వరకు గాయాలపాలు అయ్యారని పాక్ ప్రభుత్వం తెలిపింది. అయితే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, పాక్ ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వడం లేదని జేఏఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు.

సమస్యలపై పోరాడుతుంటే
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పౌర సమాజ కూటమిగా ఏర్పడ్డ జేఏఏసీ పీవోకేలో ఆర్థిక, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ముఖ్యంగా పీవోకేలో ఇంతకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలు, ఇంటర్నెట్ నిలిపివేత, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ, రాజకీయ వివక్ష మొదలైన సమస్యలపై పోరాడుతోంది. ఈ క్రమంలోనే, జులై 27న పాక్ ఆక్రమిత కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని పాక్ నిర్ణయించింది. అయితే ఈ శాసనసభలో ఉన్న మొత్తం 45 స్థానాల్లో 12 స్థానాలను పీవోకేకు చెందని పాక్ జాతీయులకు కేటాయిస్తూ (రిజర్వేషన్) చట్టం చేసింది. దీని వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏఏసీ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పాక్ ఆరోపించింది. అక్కడితో ఆగకుండా ప్రజాశాంతి, భద్రతకు ముప్పు ఉందనే కారణం చూపిస్తూ గతవారం జేఏఏసీ సంస్థను నిషేధించింది. దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు రోడ్లపైకి రావడంతో అల్లర్లు చెలరేగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -