ఫాం 6, 7పై బీఎల్ఓలు అవగాహన కలిగిఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

– పోలింగ్ కేంద్రాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ-మంగపేట
ఫాం 6, 7పై బూత్ లెవల్ అధికారి(బీఎల్ఓ)లు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఎల్ఓల అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. బూత్‌ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం బీఎల్ఓలతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ వారీగా బీఎల్‌వో, పది బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలని తహసీల్దార్ ను ఆదేశించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌వో, సూపర్‌ వైజర్ల పేర్లు, వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బూత్‌ వారీగా ఫాం 6, 7పై బీఎల్‌వోలు అవగాహన కలిగిఉండాలన్నారు. కొత్త ఓటరు జాబితా సవరణ-2023 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26, 27, డిసెంబర్‌ 3, 4వ తేదీల్లో బూత్‌ లెవల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు.
కొత్తగా ఓటు నమోదు కోసం ఫాం 6, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర అంశాలు ఏమైనా ఉంటే ప్రజలు వారిని సంప్రదించాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేపట్టాలని, బూత్‌ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సదస్సులో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి తుల రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వరరావు, ఇంచార్జ్ ఎంపీడీఓ పి.శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి, బీఎల్ఓలు పాల్గొన్నారు.

Spread the love