బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎస్‌ఏ చట్టాలను ఉపసంహరించాలి

బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎస్‌ఏ చట్టాలను ఉపసంహరించాలి– హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ ఎదుట న్యాయవాద సంఘాల ధర్నా
– ప్రజాస్వాస్ఫూర్తికి విరుద్ధం:పార్థసారధి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎస్‌ఏ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు న్యాయవాద సంఘాలు ధర్నా నిర్వహించాయి. మంగళవారం హైకోర్టు ఆవరణలోని బార్‌కౌన్సిల్‌ గేటు దగ్గర ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌(ఏఐఎల్‌యూ), ఇండియన్‌ అసోసియేన్‌ ఆఫ్‌ లాయర్స్‌(ఐఏఎల్‌), ఇండియన్‌ లాయర్స్‌ యూనియన్‌(ఐఎల్‌యూ) ఆధ్వర్యంలో నాయవాదులు మధ్యాహ్నాం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె. పార్ధసారధి, ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ చేయకుండా, వివిధ తరగతులు, మేధావుల అభిప్రాయాలు సేకరించకుండా ఒంటెద్దు పోకడలతో కొత్త చట్టాలను తెచ్చి అమలుచేయడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రధానంగా సమానత్వం, జీవించే హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించారు. ఈ కొత్త చట్టాల ద్వారా సామాన్యుల హక్కులను కాలరాసి దేశ వ్యవస్థని పోలీసుల చేతుల్లో పెట్టి అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందని గుర్తు చేశారు. కొత్త చట్టాల అమలు ద్వారా ప్రశ్నించే గొంతుకల్ని నొక్కి వాక్‌ స్వాతంత్రాన్ని సైతం హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌ మంజూరి వ్యవస్థను కొత్త చట్టాలు మరింత క్లిష్ట తరం చేశాయనీ, సామాన్యులను జైల్లో మగ్గేలా కొత్త చట్టాలను రూపొందించారని విమర్శించారు. నేర నమోదు ప్రక్రియను పోలీస్‌లు జాప్యం చేయడంతోపాటు బాధితులను పీడించే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మూడు చట్టాలపై పార్లమెంట్‌లో చర్చించి పున:సమీక్ష చేయాలని కోరారు. ప్రజల స్వచ్ఛను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మూడు సంఘాల నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Spread the love