బోనమెత్తిన భాగ్యనగరం భారీగా తరలివచ్చిన భక్తులు

నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. తెల్ల వారు.ఆము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారికి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని దాదాపు 460 దేవాలయాలు బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకున్నది. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో.. రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌. ఎమ్మెల్సీ వాణిదేవి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, భారత మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, తదితరులు ఉన్నారు. కాగా, క్యాసినోలు నిర్వహిస్తూ గతంలో పోలీసులకు చిక్కిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌.. లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకునే క్రమంలో భద్రతా సిబ్బంది గన్‌తో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బోనాల ఉత్సవాల్లో నృత్యం చేసుకుంటూ ఒక్కసారిగా బోనాలతో ఆలయానికి వచ్చిన సందర్శకులను అదుపుచేసేందుకు వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దాంతో పోలీసుల వ్యవహార శైలిపై సందర్శకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love