తునికాకు బోనస్‌ నిధులను విడుదల చేయాలి

తునికాకు బోనస్‌ నిధులను విడుదల చేయాలి– అటవీ అధికారుల నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలి : అటవీ సంరక్షణ ముఖ్యఅధికారి టీఏజీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న తునికాకు బోనస్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అటవీ సంరక్షణ ముఖ్యఅధికారి డోబ్రియాల్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు, ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, సహాయ కార్యదర్శి బండారు రవికుమార్‌, ఉపాధ్యక్షులు తొడసం భీంరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజనులు, ఇతర పేదలకు సంబంధించిన తునికాకు బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2016లో విడుదల చేసిందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెల్లించారనీ, మరికొన్ని జిల్లాల్లో చెల్లించలేదని పేర్కొన్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ఎక్కువ గ్రామాల కూలీలకు ఇప్పటి చెల్లించలేదని తెలిపారు. వెంకటాపురం ఎఫ్‌ఆర్వో బోనస్‌ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదనీ, డబ్బులు రాలేదంటున్నారని వివరించారు. తాడ్వాయి మండలంలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎనిమిది వేల మంది లబ్దిదారులకుగాను నాలుగు వేల మందికే పంపిణీ చేశారని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం మందికి మాత్రమే తునికాకు బోనస్‌ ఇచ్చారని పేర్కొన్నారు. 70 శాతం మందికి ఇంకా అందలేదని వివరించారు. నార్నూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల లబ్దిదారులకు ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలో అటవీ శాఖ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రూ.ఆరు లక్షలు కాజేసిన విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నిధులను వెంటనే చెల్లించకుంటే దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను విడుదల కోసం జిల్లా అటవీ అధికారులు, రేంజ్‌ అధికారుల స్థాయిలో జరుగుతున్న అశ్రద్ధ, నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. లబ్దిదారుల వివరాలతో రేంజ్‌, జిల్లా స్థాయిలో జాబితాను పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు వారికి తగిన ఆదేశాలను జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్‌ సీనియర్‌ నాయకులు సూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love