Wednesday, April 29, 2026
E-PAPER
Homeరంగారెడ్డిఅమ్రాబాద్‌ పునరావాసానికి ఊతం

అమ్రాబాద్‌ పునరావాసానికి ఊతం

- Advertisement -

మౌలిక సదుపాయాలకు గ్రీన్‌ సిగల్‌
వన్యప్రాణి మండలి స్టాండింగ్‌ కమిటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమ్రాబాద్‌ పునరావాసానికి ఊతమిస్తూ వన్యప్రాణి మండలి స్టాండింగ్‌ కమిటీ తొలి సమావేశం అక్కడ మౌలిక సదుపాయాలకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని జువాలజికల్‌ పార్కులో కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రక్షిత అటవీ ప్రాంతాల్లో చేపట్టే పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ప్రాంతం నుంచి గ్రామాల స్వచ్ఛంద పునరావాసంపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగు గ్రామాలకు చెందిన 417 కుటుంబాల్లో 160 కుటుంబాలు ప్రత్యక్ష నగదు పరిహారం ఎంపిక చేసుకోగా, 257 కుటుంబాలు పునరావాస ప్యాకేజీకి అంగీకరించాయి. నగదు పరిహారం ఎంపిక చేసిన కుటుంబాలకు ఇప్పటికే జాయింట్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచి, ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు జమ చేసినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, గ్రామస్థుల విజ్ఞప్తుల మేరకే అమలు చేస్తున్నట్టు వివరించారు. ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.

బాచారం పునరా వాస కాలనీలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల కేటాయింపుతో పాటు మౌలిక సదుపా యాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో రెండు రహదారి ప్రాజెక్టులకు కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టుల అమలులో వన్యప్రాణి సంరక్షణ చర్యలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. డిండి బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అటవీ భూమి వినియోగానికి అనుమతినిచ్చారు. కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌, ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. మనుషులు-వన్య ప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు నెహ్రూ జూవాలజికల్‌ పార్క్‌, అమ్రాబాద్‌, కవాల్‌, కాకతీయ జూలాజికల్‌ పార్క్‌లలో క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

అలాగే పర్యావరణ రుసుముల ద్వారా వచ్చిన నిధులను వన్యప్రాణి సంరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధికి వినియోగిస్తు న్నట్టు వివరించారు. సమావేశంలో వికారాబాద్‌ జిల్లా లోని యెంకతల గడ్డి భూములను కన్జర్వేషన్‌ రిజర్వ్‌ గా ప్రకటించే అంశాన్ని పరిశీలించా లని సూచనలు వచ్చాయి. మంజీరాను రామ్సార్‌ సైట్‌గా ప్రకటించే ప్రతిపాదనపై కూడా చర్చించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రతిపాదించిన ఎథనాల్‌ ప్లాంట్‌, డిండి ముంపు ప్రాంతంలో కేబుల్‌ లేయింగ్‌ ప్రాజెక్ట్‌లను పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తిరస్కరించారు.నెహ్రూ జూపార్కులో కొత్త ఎన్‌క్లోజర్‌ హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలజికల్‌ పార్కు లో పక్షులు, కోతులకు సంబంధించి కొత్త ఎన్‌ క్లోజర్‌ ను మంత్రి కొండాసురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్‌ జూను అప్‌గ్రేడ్‌ చేయడానికి త్వరలో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసి,కేంద్ర అనుమతులు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -