వారిద్దరు భారత్ గౌరవాన్ని నిలబెట్టారు: రవిశాస్త్రి

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఇంకా పోటీలో నిలవడానికి కారకుల్లో రహానే, ఠాకూర్ కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. దీంతో వీరిద్దరిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రహానే పోరాటాన్ని మెచ్చుకున్నారు. రహానే ఎంతో స్వేచ్ఛగా ఆడాడని ప్రశంసించారు. ‘‘అజింక్య రహానే అందంగా ఆడాడు. అతడి ఎత్తుగడలు, ఆట పట్ల స్పష్టత నిజంగా ఫస్ట్ క్లాస్. దూకుడుగా ఆడుతూనే, జాగ్రత్తగా వ్యవహరించాడు. పరుగుల కోసం ప్రయత్నం సాగించాడు. అది శార్ధూల్ ఠాకూర్ పైనా ప్రభావం చూపించింది. నిజంగా అద్భుతమైన భాగస్వామ్యం వారిది. భారత్ గౌరవాన్ని నిలబెట్టింది’’అని రవిశాస్త్రి అన్నారు.
అజింక్య రహానేని ఈ ఏడాది మినీ వేలంలో ఎవరు వద్దనుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.50 లక్షల బేసిక్ ధరకు తీసుకుంది. ఆడేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. చాలా సీనియర్ అయిన రహానే ఈ అవకాశంతో రెచ్చిపోయాడు. స్వేచ్ఛగా ఆడి సీఎస్కే తరఫున పలు విజయాల్లో కీలకంగా పనిచేశాడు. దీనిపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత రహానేని దీనిపైనే ప్రశ్నించాడు. దీనికి రహానే స్పందిస్తూ.. నిజమే సీఎస్కేలో ఉండడాన్ని తాను ఎంతో ఆనందించినట్టు చెప్పాడు. రవిశాస్త్రి సైతం స్పందిస్తూ.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తో అతడికి ఒక విధమైన స్వేచ్ఛ లభించిందన్నారు.

Spread the love