సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

నవతెలంగాణ – అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైకాపా ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరసనలు తెలుపుతున్న దళితులపై దాడి చేసి గాయపరిచారని మండిపడ్డారు. దళితులపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని సీఎంకు రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్‌ చేశారు. యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో వారికి కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. వైకాపా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ తమ అనుచరుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తవ్వకాలను నిరసిస్తూ ఈనెల 6వ తేదీన చించినాడ దళితులు నిరసనలకు దిగితే పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని పోలీసులు సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని విమర్శించారు. ఈ ఘటనలో నిందితులను రక్షించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

Spread the love