బీజేపీ పంచన వైసీపీ, టీడీపీ

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఛీకొడుతుంటే రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం మోడీ సర్కార్‌ మెప్పు కోసం పరితపిస్తున్నాయి. మణిపూర్‌ మారణకాండ నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలిపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా..వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీ పంచనే నిల్చున్నాయి. శాంతిభద్రతలు కేంద్ర హోంశాఖ చూసుకుంటుందని, ప్రభుత్వంపై అవిశ్వాసం అనవసరమని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అన్నారు.
బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. మణిపూర్‌ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని, ఇది పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుందన్నారు. ఇలాంటప్పుడు ఉభయ సభలను నిలిపివేయడం వల్ల ఉపయోగం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. లోక్‌సభ స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాకి మద్దతు ఇచ్చే సభ్యులను నిలబడమని కోరినప్పుడు సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపిలంతా నిలబడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా తమ స్థానాల్లో నిలబడి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అయితే సభలో ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ మాత్రం తీర్మానానికి మద్దతుగా నిలబడలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనట్టు స్పష్టం అయింది.

Spread the love