నేడు భారత్‌, విండీస్‌ మూడో వన్డే

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యువ ఆటగాళ్లకు మరో చక్కటి అవకాశం! మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో టీమ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. మెగాటోర్నీ సన్నాహకాల్లో భాగంగా ప్రయోగాలు కొనసాగించాలనుకుంటున్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో కూడా సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు చాన్స్‌ ఇవ్వాలని భావిస్తున్నది. దీంతో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ వంటి వాళ్లకు మరో గోల్డెన్‌ చాన్స్‌ దక్కినట్లే. తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించగా.. సీనియర్లు దూరమైన రెండో మ్యాచ్‌లో విండీస్‌ గెలిచింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం కాగా.. నిర్ణయాత్మక పోరులో సత్తాచాటాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ రూపంలో ఓపెనర్లు బలంగానే ఉన్నా.. మిడిలార్డర్‌తోనే ప్రధాన సమస్య ఎదురవుతున్నది. మరి గత మ్యాచ్‌ తప్పిదాలను పక్కనపెట్టి మనవాళ్లు సమిష్టిగా సత్తాచాటుతారా చూడాలి.

Spread the love