బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు అరెస్టు

నవతెలంగాణ సంగారెడ్డి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో ఆయన సంతోష్‌ గ్రానైట్‌ మైనింగ్ పేరుతో క్రషర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో తాజాగా ఈ అంశంపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మధుసూదన్‌పై అక్రమ మైనింగ్‌, చీటింగ్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. క్రషర్లను సీజ్‌ చేశారు. మధుసూదన్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన్ను ఆసుపత్రి తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. వారిని నిలువరించి పోలీసులు మధుసూదన్‌ను సంగారెడ్డికి తరలించారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించగా ప్రధాన ద్వారం మూసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Spread the love