బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం లోపాయికారీ పొత్తు

బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం లోపాయికారీ పొత్తు– సీపీఐ కాంగ్రెస్‌ కూటమిని ఓడించేందుకు కుట్రలు..
– మైనార్టీలు ఆలోచించి ఓటు వేయండి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఎన్నికల బరిలోకి దిగి ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌ పాషాతో కలిసి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ గోషామహల్‌ అభ్యర్థి రాజాసింగ్‌పై పోటీ పెట్టకుండా, జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ మైనార్టీ అభ్యర్థిపైన ఎంఐఎం బరిలో దిగడం మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం స్పష్టమవుతుందని విమర్శించారు. పదేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ బీఆర్‌ఎస్‌లకు గ్యాస్‌ ధరలు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు.. యువతను, విద్యార్థులను మోసం చేసేందుకు తప్పుడు మ్యానిఫెస్టోలను ప్రకటించారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయక పోగా, ఉన్న సంస్థలను విక్రయించి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిందని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోటీ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని దుయ్యబట్టారు. శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లను కూడా తెచ్చుకోలేని బీజేపీ బీసీని ఎలా ముఖ్యమంత్రి చేస్తుందని ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజj్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని గుర్తు చేశారు. లిక్కర్‌ కేసులో కవితను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్న కొత్తగూడెం శాసనసభ నియోజకర్గంలో ఒక ఇండిపెండెంట్‌ వ్యక్తికి వామపక్ష పార్టీగా చెప్పుకునే ఫ్వార్వర్డ్‌ బ్లాక్‌ బీ ఫామ్‌ ఎలా ఇస్తుందని నారాయణ ప్రశ్నించారు. సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌ పాషా మాట్లాడుతూ యూపీ, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం, తెలంగాణ సొంత రాష్ట్రంలో కేవలం 9 సీట్లలోనే ఎందుకు పోటీ చేస్తుందని నిలదీశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాసనసభ నియోజకర్గాల్లో ముస్లింల ప్రభావం ఉంటుందని, ఈసారి ఎంఐఎం తీరుపై ఆలోచించి ఓటు వేయాలని వారికి సూచించారు. తెలంగాణలో కర్నాటక తరహా మార్పులు వస్తాయని అజీజ్‌ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌, నర్సింహ పాల్గొన్నారు.

Spread the love