నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్థులకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కాక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
అదే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచిందని, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టిందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిందని, కానీ ప్రస్తుతం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మరపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కే హైమద్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , గ్రామస్థులు పాల్గొన్నారు.



