మైనార్టీ డిక్లరేషన్‌తో బీఆర్‌ఎస్‌కు భయం

– కర్నాటక మంత్రి జమీర్‌ అహ్మద్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మైనార్టీ డిక్లరేషన్‌తో బీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని కర్నాటక మంత్రి జమీర్‌ అహ్మద్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అజరుకుమార్‌ ఎమ్మెల్సీ అబ్దుల్‌ జబ్బార్‌, ఉజ్మా షాకీర్‌, కమలాకర్‌, వచన్‌ తదితరులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల్లో వక్ఫ్‌ బోర్డు భూములుంటే 54 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ఆరోపించారు. వక్ఫ్‌ బోర్డ్‌ భూముల వివరాలు కనీసం రికార్డుల్లో కూడా చేర్చలేదన్నారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రకటించిన కేసీఆర్‌ ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. జమా మసీదు మరమ్మతులకు రూ. 2.30 కోట్ల కేటాయించిన కేసీఆర్‌ కేవలం రెండు లక్షలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పారు. కేవలం ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మైనార్టీలకు ఏదో రాజకీయంగా ఉద్ధరించినట్టు కేసీఆర్‌ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనార్టీలకు అన్ని రంగాలవారికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్‌ విజయం సాధ్యమన్నారు.
కాంగ్రెస్‌కు ముస్లింలీగ్‌, ఆర్‌పీ సంపూర్ణ మద్దతు
కాంగ్రెస్‌కు ముస్లింలీగ్‌, రిపబ్లికన్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీకి ఓట్లు వేయాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చాయి. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ సీనియర్‌ నేత మల్లు రవిని ముస్లింలీగ్‌ నేతలు ఒమర్‌, ఇముల్‌, ఆర్పీ అధ్యక్షులు స్వామిప్రభుదాస్‌ కలిసి మద్దతు ప్రకటించారు.
త్వరలో విజయశాంతి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు
పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి
రాష్ట్రంలో రాజకీయ పునరేకికరణ జరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి చెప్పారు.అందులో భాగంగానే బీజేపీ నేత విజయశాంతి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో కంటోన్మెంట్‌ అభ్యర్థి వెన్నెల, పార్టీ నేత వచన్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 85-95 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 30న ఓట్ల యుద్ధంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love