బీఆర్‌ఎస్‌, బీజేపీలపై ప్రజా వ్యతిరేకత

బీఆర్‌ఎస్‌, బీజేపీలపై ప్రజా వ్యతిరేకత– ఆకాంక్షలు నెరవేర్చలేదని ఆగ్రహం
– ప్రభుత్వ విద్య, వైద్యం విధ్వంసంతో జీవితాలు ఛిద్రం
– కాంగ్రెస్‌, సెక్యులర్‌ శక్తుల వైపు మొగ్గు
– ఓటర్‌ చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమంలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌, బీజేపీలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని జాగో (మేలుకో) తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్‌) నాయకులు తెలిపారు. జాగో తెలంగాణ, టీఎస్‌డీఎఫ్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 26న హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ నుంచి ప్రారంభమైన ఓటరు చైతన్య యాత్ర 28 జిల్లాల్లోని 64 నియోజకవర్గాల్లో 198 సమావేశాలు నిర్వహించింది. మంగళవారం యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు యాత్ర విశేషాలను వెల్లడించారు. జాగో (మేలుకో) తెలంగాణ కన్వీనర్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ యాత్రలో కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌కు చెందిన పొగరుబోతులు అడ్డగించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు వారిని నిలవరించారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని, భూకబ్జాలు ఇసుక, లిక్కర్‌ దందాలు, వేల కోట్ల రూపాయలను ప్రజలు గుర్తించారని తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగులు, 26 లక్షల మంది ఇల్లు రానివారితో పాటు విద్యాభ్యాసం చేస్తున్న 60 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత బంధు రాని దళితులు, ఐటీడీఏ ధ్వంసం చేసినందుకు గిరిజనులు బీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అదే విధంగా 20 లక్షల మంది కౌలు రైతులు, 40 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు తమకు మేలు జరగలేదనే భావనలో ఉన్నారని తెలిపారు.
జాగో (మేలుకో) తెలంగాణ చైర్మెన్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ మతోన్మాద బీజేపీని, అవినీతి బీఆర్‌ఎస్‌లను ఓడించాలని పిలుపునిచ్చారు. నాయకులు కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ, జనసేన పార్టీ కేవలం బీజేపీ ఆదేశాలతో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ జన సేనకు టికెట్‌ కేటాయించిందని చెప్పారు. అదే విధంగా ఎంఐఎం జూబ్లిహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు బరిలో నిలిచిందన్నారు. ప్రొఫెసర్‌ పద్మజా షా మాట్లాడుతూ, మద్యం ఏరులై పారుతున్న తీరు పట్ల బీఆర్‌ఎస్‌పై గ్రామీణ మహిళలో తీవ్ర వ్యతిరేకత కనిపించిందని చెప్పారు. ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై నమ్మకం లేనికేసీర్‌ మూటలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ లక్ష్మినారాయణ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ప్రతి 25 ఏండ్లకు ఒక ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమం, తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం జాగో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. దళిత బహుజన ఫ్రంట్‌ నాయకులు శంకర్‌ మాట్లా డుతూ దళిత బంధు ఇవ్వకపోవడం, మూడెకరాల భూమి పంచకపోవడం, భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకపోవడంతో దళితులు బీఆర్‌ఎస్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. స్కైబాబా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు వక్ఫ్‌ ఆస్తులను కబ్జా చేశారని ముస్లీంలు గ్రహించారనీ, వారిలో అత్యధికులు బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సోగరా బేగం మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలను కోరారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించాలని కోరారు.

Spread the love