పోచారం మెజార్టీ యే లక్ష్యం: బీఆర్ఎస్‌ నేత పెర్క శ్రీనివాస్

నవతెలంగాణ-నసురుల్లాబాద్: నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే లక్ష్యమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, నసురు ల్లాబాద్ మండల బీఆర్ఎస్‌ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్  అన్నారు. మంగళవారం మండలంలోని మిర్జాపూర్, దుర్కి, నాచుపల్లి,  గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెర్క శ్రీనివాస్ మాట్లడుతూ  నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డికి తిరుగులేదని, ఆయన ఎదురులేని నేత అన్నారు. 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవే లక్ష్యంగా ముందు సాగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం 2011లో ఆయన ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి, ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. తిరిగి 2011 ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రెండు పర్యాలు జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ప్రజల కోసమే పరితపించే ఆయనకు ఈసారి ఎన్నికల్లో పూర్తి మెజార్టీ లక్షకుపైగా కట్టబెట్టాలని ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రి పదవులు చేపట్టి తెలుగు ప్రజల మనసులో శీనన్నగా ముద్ర వేసుకున్నారన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతన్నలకు బాసటగా నిలిచారన్నారు. బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శ నిలిచిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుందని, పల్లెల నుంచి పట్టణాల వరకు రోడ్లు పురోగతి సాధించాయన్నారు. పల్లె పల్లెలో సిసి, బిటి రోడ్లు దర్శనమిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ లాంటి పథకాలు రైతులకు, ప్రజలకు మేలు చేకూర్చిందని అన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో పేద ఆడపిల్ల వివాహాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని శ్రీనివాసరెడ్డి నిరుపేదలకు గృహాలు మంజూరు చేయిస్తున్నారని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర పింఛన్లు అందరికీ అదే విధంగా చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసమే పని చేసే శీనన్నకు ఏడో సారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ కట్టబెట్టాలని ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారని. ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన జోస్యం చెప్పారు. వీరి వెంట ఎంపిపి పాల్త్య విఠల్,  మజీద్, అంకొల్ రాము, సాయిలు యాదవ్, ప్రతాప్ సింగ్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Spread the love