నవతెలంగాణ – పరకాల
తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలంటే గత పాలనలో చేసిన తప్పులకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ మొదలుకొని స్థానిక నాయకుల వరకు అందరూ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే అబద్ధాల పురాణం మొదలుపెట్టారని మండిపడ్డారు.
తమ పార్టీ నాయకులను, ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్న కేటీఆర్‌కు ఇంకా ప్రజల తీర్పు పట్ల స్పృహ రాలేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని పదేపదే చెబుతున్న కేటీఆర్, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆయన తండ్రి ఎక్కడ దాక్కున్నారని సూటిగా ప్రశ్నించారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పాలనదని ఆరోపించారు. ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరిస్తే కనీసం ఒకటో రెండో సీట్లయినా దక్కుతాయని, లేదంటే పార్టీ పూర్తిగా జీరోగా మారడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఫామ్‌హౌస్ రైడ్ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత చేసిన ఆరోపణలకే ఇంకా జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని, అలాంటి వారికి తనపై మాట్లాడే నైతికత లేదన్నారు. తన పాపాలను కడుక్కోవడానికే కుట్టు మిషన్ల పంపిణీ వంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. గతంలో నర్సంపేటలో మూడుసార్లు గెలిచిన తనకు, ప్రజల విశ్వాసమే కొండంత అండ అని, డబ్బులతో రాజకీయాలు చేసే అలవాటు తనదని స్పష్టం చేశారు. తన ఆస్తులు గతంలో కంటే ఇప్పుడు తగ్గాయే తప్ప పెరగలేదని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై విమర్శలు చేస్తూ.. 100 బర్లను తిన్న రాబందుగా అభివర్ణించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని, అక్కడ మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తోంది తమ ప్రభుత్వమేనని చెప్పారు. రౌడీయిజానికి పరకాలలో తావు లేదని, తన పాలన ప్రజల ప్రశాంతత కోసం పని చేస్తుందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఇబ్బంది పెడితే, తాము వచ్చిన తర్వాతనే బిల్లులు చెల్లించామని గుర్తు చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకుల తీరు ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.



