రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వైఖరి తెలపాలి  

నవతెలంగాణ- చేర్యాల
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల వైఖరి ఏమిటో ప్రజలకు తెలపాలని జేఏసీ జనగామ నియోజకవర్గ నాయకుడు అందె అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలో మంగళవారం మాజీ సర్పంచ్ రంగు శివశంకర్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అందె అశోక్,చేర్యాల మండల కన్వీనర్ బొమ్మగాని అంజయ్య గౌడ్ మాట్లాడుతూ చేర్యాల ప్రాంతం ముక్కలు చెక్కలుగా విడిపోయి ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెవెన్యూ డివిజన్ విషయంలో నోరు మెదపకపోవడం ఏంటని ప్రశ్నించారు.గత కొన్ని సంవత్సరాలుగా జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ సర్పంచులతో తీర్మానాలు చేపించి ప్రభుత్వానికి పంపినప్పటికీ తీర్మానాలు ఎక్కడ వేశారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఇంత ఉద్యమం జరుగుతుంటే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కనీసం రెవెన్యూ డివిజన్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం  విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రాంతీయోతరుడు కాబట్టే  చేర్యాల ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాధన  కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై జేఏసీగా గ్రామ కమిటీలు నిర్మించుకొని రెవెన్యూ డివిజన్ సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
జేఏసీ రాంపూర్ గ్రామ కమిటీ ఎన్నిక
గ్రామ కన్వీనర్ గా రంగు రాజమౌళి, కో కన్వీనర్లుగా నిమ్మ లక్ష్మారెడ్డి, బండారి సిద్ధయ్య, బండారి నర్సయ్య, కార్యదర్శిగా మలిపెద్ది రవీందర్, సహాయ కార్యదర్శిగా నిమ్మ మహేందర్ రెడ్డి, బండారి మల్లయ్య, రంగు సుభాష్, ప్రతినిధులుగా శెట్టె మల్లయ్య, మంతెన హనుమారెడ్డి, రంగు రాజు, ఆర్. అంజయ్య తోపాటు 15మందితో కమిటీని ఎన్నుకున్నారు.
Spread the love