నేడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త నిరసనలు

Today BRS Statewide protests– మాజీ సీఎం కేసీఆర్‌ పిలుపు
– రైతాంగాన్ని మోసం చేస్తున్నారంటూ ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతాంగానికి అండగా ఉండాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది రైతుల్ని దగా చేసి, వంచించి మోసం చేయడమే అని తీవ్రంగా విమర్శించారు. ”రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ”ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెసోళ్లకు రైతుల అవసరం తీరిపోయిందనీ, అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని దుయ్యబట్టారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామనే మాట ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఇప్పటికే రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనేందుకు నిర్లక్ష్యం చేస్తూ, రైతుల్ని గోసపెడుతున్నారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలు చేపట్టి, ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు వెళ్ళాలని పిలుపునిచ్చారు.

Spread the love