ఉపాధ్యాయుడి దారుణ హత్య

Brutal murder of a teacher– కలప వ్యాపారంలో శత్రువుల పనేనా..?
నవతెలంగాణ-కూసుమంచి
ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌ గూడెం శివారులో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయకన్‌ గూడెం గ్రామానికి చెందిన బైరోజు వెంకటాచారి (58) నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో పీఈటీ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా రోజు మాదిరిగానే బుధవారమూ బైక్‌పై పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో మాటు వేసిన హంతకులు కారు, బైక్‌లపై ఆయన్ని వెంబడించారు. మండలంలోని మందడి నరసయ్య గూడెం గ్రామ శివారు ప్రాంతాల్లో ఉపాధ్యాయుడి బండిని కారుతో వెనుక నుండి ఢకొీట్టారు. దాంతో కింద పడిన ఉపాధ్యాయుడ్ని అత్యంత దారుణంగా గొడ్డలితో మెడపై నరికారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కంది జితేందర్‌ రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌ కుమార్‌ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వివరాలు మాత్రం వెల్లడించలేదు. హత్యకు ముందు గ్రామంలోని ఓ బెల్ట్‌షాపులో హంతకులు మద్యం తాగినట్టు, అక్కడి నుంచి ప్లాన్‌ వేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా, మృతుడు వెంకటాచారి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రాక ముందు.. సొంతగా కలప వ్యాపారం (టింబర్‌ డిపో) చేసేవారు. ఇప్పటికీ వ్యాపారం కొనసాగిస్తూనే ఉండగా, కొన్నేండ్లుగా ఆయనకి కలప వ్యాపారం చేస్తున్నవారితో గొడవలు ఉన్నట్టు సమాచారం. ఆ గొడవలే ఈ హత్యకు దారితీసిందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love