బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య..

నవతెలలంగాణ – హైరదాబాద్  : వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు. మృతుడు శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. హత్యపై హర్షవర్దన్‌ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్ష్యతోనే శ్రీధర్‌రెడ్డిని హత్య చేశారని ఆయన ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ మద్దతుదారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్దన్‌రెడ్డి చెప్పారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love