దండకారణ్యంలో మళ్లీ పేలిన తూటా

In Dandakaranyam Bullet fired again– ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టులు మృతి
– 15 రోజుల వ్యవధిలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్‌
– ఈ ఏడాదిలో 91 మంది హతం..
నారాయణపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో 15 రోజుల వ్యవధిలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళలతో కలిపి పది మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్‌- కంకెర్‌ జిల్లాల మధ్య ఉన్న అడవిలో భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి విజరు శర్మ తెలిపారు. ఈ నెల 16న కంకెర్‌ జిల్లాలోని కల్పెర్‌ గ్రామంలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం కల్పెర్‌ గ్రామానికి దక్షిణంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌ను భారీ విజయంగా హోం మంత్రి విజరు శర్మ అభివర్ణించారు. మావోయిస్టులు ఇప్పటికైనా చర్చలకు ముందుకు రావాలని, హింసా మార్గాన్ని వీడాలని విజ్ఞప్తి చేశారు.
అభుజ్మాద్‌ ప్రాంతంలోని టెక్మెత, కకూర్‌ గ్రామాల మధ్య ఉన్న అడవిలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. పోలీసులకు చెందిన జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సంయుక్త బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో సాయుధ నక్సలైట్లు ఉన్నారనే కచ్చితమైన సమాచారంతో సోమవారం రాత్రి నుంచి ఈ తనిఖీలు ప్రారంభించి నట్టు పోలీసు అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిన తరువాత 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. మృతి చెందిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని అన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి ఒక ఎకె-47 రైఫిల్‌, ఒక ఐఎన్‌ఎస్‌ఎఎస్‌ రైఫిల్‌, ఇతర ఆయుధాలు, మందు గుండు సామగ్రి, పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో పాల్గొన్న భద్రతా సిబ్బందిని ఉపముఖ్యమంత్రి విజరు శర్మ అభినందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. ‘ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను మావోయిస్టులతో చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుకుంటుంది. మావోయిస్టులు వ్యక్తిగతంగా కానీ, గ్రూపులుగా కానీ వీడియో కాల్‌ లేదా మధ్యవర్తి ద్వారా మాట్లాడాలనుకుంటే మేం సిద్ధంగా ఉన్నాం. వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తాం. ఆయుధాలు వీడి ప్రధాన జీవన స్రవంతిలో చేరాలని మేం వారిని కోరుతున్నాం. బస్తర్‌లో శాంతి నెలకొనాలని, అభివృద్ధి చెందాలని మేం కోరుకుంటున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
మరోవైపు నారాయణపూర్‌, కాంకెర్‌తో సహా మొత్తం ఏడు జిల్లాలు ఉన్న బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 91 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు చెప్పారు.

Spread the love