మండుతున్న కూరగాయలు

Burning vegetables– బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
– టమాట మినహా ఆకాశాన్నంటిన అన్నింటి ధరలు
– రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం
– దిగుమతితో తప్పని ఇక్కట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. టమాట మినహా అన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. నెల రోజుల క్రితం వరకు రిటైల్‌ మార్కెట్లో కిలో రూ.30 నుంచి రూ.40 పలుకగా, నేడు రూ.80 నుంచి 120కి చేరుకున్నాయి. డిమాండ్‌కు సప్లయికి మధ్య భారీ తేడా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి అనుకున్న స్థాయిలో దిగుమతి కాకపోవడం వెరసి కూరగాయలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్‌లోకి వెళ్లాలంటేనే పేద, మద్య తరగతి ప్రజలు ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్న చందాన తయారైంది కూరగాయల పరిస్థితి. నిన్నటి వరకు నేల చూపులు చూసిన కూరగాయలు నేడు అమాంతం పెరిగాయి. ఏది కొందామన్న రూ.80 నుంచి రూ.120 వరకు తక్కువ ఎక్కడా దొరకడంలేదు. రిటైల్‌ మార్కెట్లో కేజీ రూ.40 ఉన్న పచ్చిమిర్చి ప్రస్తుతం రూ.80కు చేరింది. రూ. 40 ధర ఉన్న వంకాయలు రూ.100 పలుకుతుండగా, బీరకాయలు రూ.40 నుంచి రూ.120కి చేరాయి. కాకర, దొండ, బీన్స్‌, క్యారెట్‌, బీట్‌ రూట్‌, క్యాప్సికం రూ. 100 మార్కు దాటాయి. నలుగురు ఉన్న కుటుంబం వారం క్రితం రోజుకు అర కేజీ కూరగాయలు కొనగా, ప్రస్తుతం పావుకిలోతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఆశించినంతగా లేక పోవడం పెరుగుదలకు కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.
తగ్గిన సాగు విస్తీర్ణం
తెలంగాణలో కేవలం ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నారు. వాటిని సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రం ఏర్పడే సమయంలో కూరగాయల ఉత్పత్తి సంవత్సరానికి 32 లక్షల టన్నులు. ప్రస్తుతం అది19 లక్షల టన్నులకు తగ్గింది. ప్రధాన నగరాలు, పట్టణాల డిమాండ్‌ను తీర్చడానికి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాల్లో కూరగాయల పంటలను విత్తడానికి రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించేవి. అయితే, గత తొమ్మిదేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కారణంగా, ఈ వ్యవసాయ క్షేత్రాలు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారాయి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు ఇతర టైర్‌-2 నగరాలను కలుపుకుని కూరగాయల పంట కాలనీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. స్వయంగా ప్రభుత్వమే రెండేళ్లపాటు రవాణా, మార్కెటింగ్‌తోపాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేసింది. అయితే ఎలాంటి కారణం చూపకుండా 2018 నుంచి సబ్సిడీలను నిలిపివేయడంతో కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారు.
ధరలను ప్రభుత్వం నియంత్రించాలి
ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అన్యూహ్యంగా పెరిగిన కూరగాయల ధరలను ప్రభుత్వ నియంత్రించాలి.ఏది కొనాలన్నా రూ. 100పైనే ఉంది. ఇలాగైతే సామాన్యులు బతకడం కష్టం. ప్రభుత్వం కూరగాయలను సబ్సీడీ రూపంలో రైతు బజార్లలో విక్రయించాలి
రవీందర్‌, ఎల్బీనగర్‌, హైదరాబాద్‌.
ఏం కొనేటట్టు లేదు
కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఏ కూరగాయలైనా రూ.80కి తక్కువగా లేవు. చిన్న చితక పనులు చేసుకునే మధ్యతరగతి కుటుంబాల వారికి చాలా కష్టంగాఉంది. అరకిలో పావుకిలోతో సరిపెట్టుకుంటున్నాం. కూరగా యల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలి.
రామ్మూర్తి, పంజాగుట్ట, హైదరాబాద్‌
డిమాండ్‌, సప్లయి మద్య వ్యత్యాసం
రాష్ట్రానికి ఏటా దాదాపు 40 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అయితే మన రాష్ట్రంలో కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. డిమాండ్‌, సప్లరుల మధ్య భారీ అంతరం ఉండడంతో రవాణా ఛార్జీలు, లేబర్‌ చార్జీలు, ఇతర ఖర్చుల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపుతున్నారు. ఫలితంగా ధరల పెరుగుదలకు దారి తీస్తోందని నిపుణులు అంటున్నారు.

Spread the love