నవతెలంగాణ – బొగొటా : నైరుతి కొలంబియాలో బస్సులో పేలుడు సంభవించి 13 మంది మృతి చెందారు. 38 మంది గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుందని ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రావెల్ బస్సులో పేలుడు పరికరం పేలడం త్రీవ కలకలం రేపింది.
కాగా, ఈ ఘటనపై కాకా ప్రాంత గవర్నర్ ఆక్టావియో గుజ్మాన్ స్పందించారు. కాజిబియో మునిసిపాలిటీలోని పాన్అమెరికన్ హైవేపై బస్సు ప్రయాణిస్తుండగా ఆ పరికరం పేలిందని గుజ్మాన్ మీడియాకు వెల్లడించారు. అలాగే గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారని కాకా ఆరోగ్య కార్యదర్శి కరోలినా కామార్గ్.. నోటిసియాస్ కారకోల్ అనే టీవీ ఛానెల్ కు తెలిపారు.
ఈ ఘటనపై కొలంబియా సాయుధ దళాల కమాండర్ జనరల్ హ్యూగో లోపెజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఇది ఒక “ఉగ్రవాద చర్య“. కొలంబియాలో అత్యంత వాంటెడ్ వ్యక్తులైన ఇవాన్ మోర్డిస్కో, జైమ్ మార్టినెజ్ వీరి ఇరువురి నెట్‌వర్క్ వల్లే ఈ ఘటన జరిగింది. వీరిద్దరూ ఆ ప్రాంతంలో పనిచేస్తున్న, ప్రస్తుతం ఉనికిలో లేని కొలంబియా విప్లవ సాయుధ దళాల నుండి విడిపోయిన అసమ్మతివాదులు` అని అన్నారు. గత రెండు రోజుల్లో నైరుతి కొలంబియాలో 26 హింసాత్మక ఘటనలు జరిగాయి. కేవలం ప్రజా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న ఈ దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అని లోపెజ్ ఆవేదన చెందారు. 2016లో ఎలాంటి హింసకు పాల్పడమని కొలంబియా ప్రభుత్వంతో ఇవాన్ మోర్డిస్కో, జైమ్ మార్టినెజ్ వర్గం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అయినా ఆ ఒప్పందాన్ని ఇరువురు పాటించడం లేదు.



