క్యాన్సర్‌ని జయించొచ్చు

చ్చుక్యాన్సర్‌ ప్రపంచంలో మానవజీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత 30 ఏళ్ళలో 50 సంవత్సరాల లోపు వయసు వారిలో మరణాలు దాదాపు 80% పెరిగాయి. దేశంలో ఏటా 14 లక్షల కేసులను కొత్తగా కనుగొనడం విచారకరం. ఒకప్పుడు గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా ఉండేవి. కొంతకాలంగా మగవారిలో ఊపిరి తిత్తుల, ప్రోస్టేట్‌, పెద్ద పేగు క్యాన్సర్లు ఎక్కువగా ఉంటే, స్త్రీలలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, పెద్దపేగు క్యాన్సర్లు ప్రధానంగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌ లక్షా ఇరవై వేల మందికి రావడం, ప్రతి 13 నిముషాలకు ఒక మరణం, దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వలన రోజుకి 200 మంది చనిపోతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మనదేశంలో క్యాన్సర్‌ ఇంతగా పెరగడానికి కారణం కనీస అవగాహన లేకపోవడం. భయం, అనుమానం కలిగిన వెంటనే డాక్టర్ని కలవకపోవడం. ఇలా చేయడం వలన క్యాన్సర్‌ ముదిరిపోయి చికిత్సకు లొంగక మరణాల బారిన పడుతున్నారు. ఈ వ్యాధి రాకుండా మనం నివారించలేం. అయితే ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స మొదలు పెట్టొచ్చు. మిగిలిన జీవితాన్ని పొడిగించుకుని సంతోషంగా జీవించగలం. ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళలో కూడా రకరకాల క్యాన్సర్లు రావడం చూస్తున్నాం.
అక్టోబర్‌ నెలను రొమ్ము క్యాన్సర్‌ అవగాహన నెల లాగా జరుపుతున్నాం. ఒకప్పుడు వయసు మళ్ళిన వారికి మాత్రమే ఎక్కువగా వచ్చేది. కానీ నేడు మారుతున్న జీవన శైలి, అధిక బరువు వలన కొవ్వు అధికంగా ఉండడం, పిల్లలు లేకపోవడం, ఆలస్యంగా గర్భం దాల్చడం, పిల్లలకు పాలివ్వకపోవడం, కుటుంబంలో పెద్దవారికి క్యాన్సర్లు ఉండడం, మద్యపానం, ధూమపానం, శారీరక శ్రమ లేని, గంటల తరబడి కూర్చుని చేసే సాప్ట్‌వేర్‌ ఉద్యోగాలు, వ్యాయామం లేకపోవడం, జన్యువుల్లో తేడాలు రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి
మనదేశంలో ఆరోగ్యం పట్ల చాలా అశ్రద్ధ. స్త్రీలలో మరీ ఎక్కువ. చాలా మంది బాగా చదువుకున్న మహిళలలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది. సహజంగా ఏదైనా ఎక్కువ బాధ ఉంటేనే డాక్టర్ని కలుస్తారు. కానీ బాగా గమనిస్తే తప్ప క్యాన్సర్లను గుర్తించలేం. మహిళలు నెలసరి అయిన 5 రోజుల తర్వాత రొమ్ములను పరీక్షించుకోవాలి. ఏదైనా అనుమానం కలిగినప్పుడు వెంటనే వైద్యుల్ని కలిస్తే పెద్ద ప్రమాదం నుండి తేలికగా బయటపడ గలరు. 40 ఏళ్ళు దాటినవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి.
లక్షణాలు :- రొమ్ములో గడ్డలుగా తగిలినా, పైన చర్మం దళసరిగా గుంటలు పడ్డట్లు, ఎర్రగా కందినట్లు కనిపించినా, చను మొనలు లోపలికి లాగినట్లు లేదా నొక్కినప్పుడు చిక్కని ద్రవం బయటకు వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ఒక్కసారి కొవ్వు గడ్డలు, ప్రమాదం కాని ఫైబ్రోఎడినోమా అనే గడ్డలు కూడా కావొచ్చు. పరీక్షలు చేస్తే తెలుస్తుంది.
సాధారణంగా క్యాన్సర్‌ అని తెలిశాక ఆపరేషన్‌ చేయకూడదు అనే అపోహతో, క్యాన్సర్‌ వచ్చిన అవయవం తీసి వేస్తారని, మరణం తప్పదని అనుకుంటారు. కానీ తీయకపోతే మరింత త్వరగా వ్యాధి విస్తరిస్తుంది. కాని నేడున్న అత్యాధునిక పరీక్షలు, పరికరాలతో కేవలం వ్యాధికి గురయిన కణజాలాన్ని, కొంత చూట్టూ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగిస్తారు. మరీ పెద్ద సమస్య అయినప్పుడు ఇతర భాగాలకు వ్యాపించకుండా ఆపడం కోసం తప్పక సంబంధిత అవయవాన్ని తీయవలసివస్తుంది.
శరీరంలోని ఏ అవయవానికి వచ్చినా ఇదే పద్ధతి. క్యాన్సర్‌ ఏ దశలో ఉందో చూసి ఆపరేషన్‌ చేసి, క్యాన్సర్‌ కణాలను నిర్మూలించడానికి మందులు (కీమోథెరపీ) ఇవ్వటం చేస్తారు. అవసరమైతే రేడియేషన్‌ కూడా ఇస్తారు. మొత్తం చికిత్స అంతా చాలా సమయం పడుతుంది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కానీ ధైర్యంగా కుటుంబ సభ్యుల సహకారంతో మనసుకు స్థిమిత పరచుకుని క్యాన్సర్‌ని ఎదుర్కొంటే జయించవచ్చు.
క్యాన్సర్‌తో పాటు చాలా వ్యాధులు శరీరంలోని ఏ భాగమైనా ఆరోగ్యంగా లేకపోతే వస్తాయి. కానీ కొన్ని మాత్రం ఏ కారణం లేకుండా కూడా రావొచ్చు. ఇవాళ మనచుట్టూ ఉన్న పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, అతినీలలోహిత కిరణాలు, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి, కల్తీ ఆహారం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కాన్సర్‌ మాత్రమే కాదు అన్ని రోగాలు పెరుగుతున్నాయి. కుటుంబసభ్యులలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే జన్యువుల ద్వారా తరువాత తరాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడవచ్చు.
ప్రత్యుత్పత్తి దశలో ఉన్న మహిళలలో కింది కడుపులో ఇన్ఫెక్షన్లు కలిగినప్పుడు, నొప్పి ఉన్నప్పుడు వైద్యుల్ని కలిస్తే పరీక్ష చేసి సులభంగా చికిత్స చేస్తారు. 30 ఏళ్ళు దాటిన వారికి అవసరమైనప్పుడు PAPA smear పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. అశ్రద్ధ చేస్తే చిన్నచిన్న ఇబ్బందులే 15 సంవత్సరాల తర్వాత క్యాన్సర్లుగా మారే అవకాశం ఉంది. బహిష్టు ఆగిపోయిన తర్వాత కూడా క్రమంగా mammagram చేసుకొంటూ ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, మురికి ప్రదేశాలు, గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో నివసించడం, చిన్న వయసులో పెళ్ళి, పిల్లలు, ఎక్కువ కాన్పులు, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు, గర్భ నిరోధక మాత్రలు ఎక్కువ కాలం వాడడం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి కారణాలు.
పొగాకు ఉత్పత్తులు ఎలా ఉపయోగించినా, పొగతాగడం వలన పెదవులు, నాలుక, గొంతు, శ్వాస నాళ, లంగ్‌, ఇంకా చాలా రకాల క్యాన్సర్లు వస్తాయి. అధిక ఉప్పు, కారం, రోడ్డుపక్కన మళ్ళీ మళ్ళీ మరిగిన నూనెలో వేయించిన పదార్దాలు, అధిక క్యాలరీలున్న జంక్‌ ఫుడ్‌, కొవ్వు పదార్థాలు ఎక్కువగా వాడటం వలన జీర్ణాశయం పెద్దపేగు క్యాన్సర్‌ రావడానికి కారణాలు. అధిక మద్యపానం వలన లివర్‌ బాగా దెబ్బ తింటుంది. అయినా చివరివరకు రిపేరు చేసుకుని బాగా పని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మనం కొంత సమయం, విశ్రాంతినివ్వాలి. లెక్క చేయక చెడు అలవాట్లు వదలక అవే చేస్తుంటే శరీరం ఎంతని సహకరిస్తుంది? అందుకే మన శరీరం చెప్పినట్లు వినాలి.
మొదటినుండి కుటుంబంలో మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించి ఆరోగ్యాన్ని పెంపొందించే అధికంగా పీచు కలిగిన పండ్లు కూరగాయలు తప్పక అందరూ తీసుకోవాలి. పాలు, గుడ్లు, చేపలు, వేపుడు కూరలు కాక అవిరి మీద ఉడికించినవి, తాజాగా ఇంట్లో చేసుకుని తినాలి. ప్రస్తుత రోజుల్లో పాలు, నీళ్లు, సరుకులు అన్నీ కల్తీ మయం. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలకు క్రిమి సంహారక మందులు, రసాయనాలవాడకం కూడా ఒక ప్రధాన కారణం. బాగా శుభ్రం చేసుకుని వాడుకోవాలి.
కుటుంబ సభ్యులలో క్యాన్సర్‌ చరిత్ర ఉంటే 10 సంవత్సరాల లోపు ఆడ పిల్లలకు నూ వాక్సిన్‌ ఇప్పించడం వలన వారికి భవిష్యత్తులో నూ వలన వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు రాకుండా కాపాడుకోగలం. హెపటైటిస్‌ వాక్సిన్‌ ఇవ్వడం వలన లివర్‌ క్యాన్సర్‌ను అధిగమించవచ్చు. ఇంత ప్రమాదకరమైన జబ్బును వ్యక్తులుగా చేస్తేనే సరిపోదు. ప్రభుత్వాలు కూడా చిత్తశుద్దితో పనిచేయాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా జతకావాలి. అంతా కలసి సమన్వయంతో చేయడం వలన మంచి ఫలితాలు త్వరగా సాధించగలం.
ప్రభుత్వం విస్తతంగా చేయాల్సినవి:…..
1. నివారణ
2. గుర్తించడం
3. నిర్ధారణ
4. చికిత్స
5 పునరావాసం
నిర్లక్ష్యం వలన ఎవరి ప్రాణాలు కోల్పోయినా కుటుంబం మొత్తం ఆర్థికంగా సామాజికంగా చితికిపోతుంది. నువ్వు చేసిన తప్పు పిల్లలకు శాపం కాకూడదు. ఎవరికి వారే కుటుంబాన్ని కాపాడుకోవడం ద్వారా సమాజానికీ సహాయం చేసినట్లు అవుతుంది.
– డా|| సిహెచ్‌.శారద, 9966430378 

Spread the love