సెల్‌ ఫోన్‌

సెల్‌ ఫోన్‌ఇప్పుడు ఫోన్‌ లేనిదే క్షణం కూడా గడవడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కనబడుతుంది. చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోతే ఒక్క క్షణం కూడా ఎవ్వరికీ పాలుపోదు. ముఖ్యంగా చిన్నపిల్లలు నిరంతరం ఫోనుకు బానిసలై, అది లేకపోతే కనీసం అన్నం కూడా తినని పరిస్థితికి వెళ్లారు. వీరు అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా తప్పనిసరిగా ఫోన్‌ పక్కన ఉండాల్సిందే. అయితే పిల్లలు ఇలా ఫోన్‌కి బానిసలు కావడానికి గల కారణం పెద్దలే. గతంలో పిల్లలు అన్నం తినాలంటే ఆ కథ, ఈ కథ చెప్పి తినిపించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తల్లిదండ్రులు వారి పనిలో వారు ఉండడానికి పిల్లలకి స్మార్ట్‌ఫోన్‌ను అలవాటు చేస్తున్న రోజులివి. చిన్న వయసులో వారు భోజనం చేయాలనో లేదా అల్లరి మాన్పించాలనో చేతిలో ఫోన్‌ పెట్టి మన పని మనం చేసుకుంటాం. అదే వారికి అలవాటుగా మారి బానిసలుగా తయారయ్యారు.
ఇక మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మూడు, నాలుగేండ్లు వచ్చేసరికి వారికోసం ఒక ఫోన్‌ సపరేట్‌గా తీసుకుంటున్నారు. అంటే చిన్న పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌ కు ఎంత బానిసలు అయ్యారో ఇట్టే అర్థమవుతుంది.
ఇకపోతే తాజాగా కమ్యూనికేషన్‌ రంగ నిపుణులు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఎనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే మొబైల్‌ ఫోన్లను ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. కొంతమంది రెండేండ్లు నిండని పిల్లలకు కూడా స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి దానిని ఆటబొమ్మగా చేస్తున్నారని, అది వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
కరోనా కాలంలో ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. దాంతో తప్పనిసరిగా పిల్లలకు సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారినప్పుడు పెద్దవాళ్ళు గట్టిగా అరుస్తుంటారు. ఇది సరైనది కాదు. అసలు వాళ్ళు సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు అనే విషయాన్ని గమనించి, మెల్లిమెల్లిగా వారిని సెల్‌ నుంచి డైవర్ట్‌ చేయాలి. పిల్లలు తరచూ సెల్‌ఫోన్‌ చూస్తూ ఉంటే మానిటర్‌ టైం సెట్‌ చేసి పెట్టాలి. అదేవిధంగా వారిని సెల్‌ఫోన్‌ నుంచి బయటకు తీసుకురావడం కోసం మనం కూడా కొన్ని సమయాలలో సెల్‌ఫోన్‌ పక్కన పెట్టడం మంచిది.
పిల్లలతో పాటు సరదాగా ఆడుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదా మీతో పాటు పిల్లలను వాకింగ్‌ తీసుకువెళ్లాలి. ఇలా ఫిజికల్‌ యాక్టివిటీస్‌లో పిల్లలను పాల్గొనేలా చేస్తే క్రమక్రమంగా సెల్‌ఫోన్‌ అలవాటు నుంచి బయటపడతారు. లేదా మనకు ఇంట్లో ఏవైన వస్తువులు అవసరమైతే వాటిని తీసుకురమ్మని చెప్పి పిల్లలను బయటికి పంపించాలి. ఇలా చేయటం వల్ల చిన్న పిల్లలను ఫోన్‌ అలవాటు నుంచి బయటకు తీసుకురావచ్చు. అలాకాకుండా వారి మానాన వారిని వదిలేస్తే కంటి చూపు సమస్యతో పాటు, ఒబేసిటీ రావడం, మెడ భాగం పట్టేయడం, వినికిడి లోపం తలెత్తడం వంటి సమస్యలు ఏర్పడుతాయి.
అందుకే పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీ తప్పనిసరి చేయాలి. దాంతోపాటు పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. వారిని ఆకర్షించేలా మంచి మంచి నీతి కథలు చదివి వినిపించాలి. పిల్లలకు అలవాటు చేయడానికైనా పెద్దలు వీలు చేసుకొని పుస్తకాలు చదవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకూ ఇదే అలవాటు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించాలి.

Spread the love